ఇళ్ల పంపిణీ అనేది నిరంతర పక్రియ : వైఎస్ జగన్
ఆంధప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఊరందూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో 1,78,840 ఇళ్లు కట్టబోతున్నామని ప్రకటించారు. ఒక్క ఊరందూరులోనే 6,732 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని అన్నారు. ఇక్కడ ఇచ్చే ఇళ్ల స్థలం మార్కెట్ ధర సెంటు రూ.7 లక్షలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో 2.5 లక్షల ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. లబ్దిదారుల ఎంపికలో కులం, మతం, ప్రాంతం పార్టీ చూడట్లేదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పక్కా ఇళ్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నామన్నారు. ఇళ్ల పంపిణీ అనేది నిరంతర పక్రియగా మారబోతోందని సృష్టం చేశారు.
ఎన్నికల హామీలో 25 లక్షల ఇళ్లు ఇస్తామన్నామని, చెప్పిన దానికంటే ఎక్కువగా 31 లక్షల ఇళ్లు ఇవ్వబోతున్నామని సీఎం జగన్ వివరించారు. దీంతో పాటు ప్రభుత్వం అనేక పథకాల ద్వారా నేరుగా మహిళల ఖాతాల్లోనే డబ్బు జమ చేస్తోందన్నారు. డబ్బు విలువ మహిళలకు తెలిసినంతగా ఎవరికీ తెలియదని వివరించారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 2 లక్షల 46 వేల 631 మంది లబ్ది పొందనుండగా అందులో లక్షా 41 వేల 775 ఇంటి పట్టాలు, 10 వేల 728 టిడ్కో ఇళ్లు మంజూరయ్యాయి.













