Chandrababu: వారి తాటా తీస్తాం… జాగ్రత్తగా ఉండాలి : చంద్రబాబు హెచ్చరిక
సెంటు భూమి కబ్జా చేసినా తాటా తీస్తాం. జాగ్రత్తగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) హెచ్చరించారు. కృష్ణా జిల్లా (Krishna District )ఈడ్పుగల్లులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఇతరుల భూములు కబ్జా చేయకుండా కొత్త చట్టం తెచ్చామని, భూ కబ్జాలు, మోసాలు, బెదిరింపులు చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. మీ తాత, తండ్రుల కష్టార్జితం మీకే దక్కాలి. కబ్జా చేయాలనుకున్న భూమి కనిపిస్తే చాలు, జైలు గుర్తుకు రావాలి. తప్పుడు సర్వేలు జరిగాయని లక్షల మంది ఫిర్యాదు చేశారు. సర్వే వల్ల సెంటు, రెండు సెంట్ల భూమి పోయిందని ఫిర్యాదులు వస్తున్నాయి. భూమి గురించి వచ్చే ప్రతి ఫిర్యాదునూ పరిష్కరిస్తాం. భూమి కొలతల్లో తేడాలు, సర్వే నెంబర్లతో తేడాలు పరిష్కరిస్తాం. వారసుల పేర్లు సరిగా ఉండేలా చూస్తాం. అన్నీ సరిచేసి మీకు పట్టాదారు పాస్‌బుక్ ఇస్తాం. పట్టాదారు పాస్‌బుక్‌లో క్యూఆర్ కోడ్ ఇస్తాం. అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు 95,200 పిటిషన్లు వచ్చాయి. జనవరి 9 వరకు రెవెన్యూ సదస్సులు జరుగుతాయి. సదస్సుల్లో ఇప్పటి వరకు 3 లక్షల మంది పాల్గొన్నారు అని చంద్రబాబు తెలిపారు.













