Chandrababu: ప్రధాని, సీఎం తర్వాత కలెక్టర్లదే : సీఎం చంద్రబాబు

ఓవైపు అభివృద్ధి చేస్తూనే మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సు (Collectors Conference) లో చంద్రబాబు మాట్లాడారు. ప్రజలు తమపై చూపిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు. కొత్తగా వచ్చిన కలెక్టర్లకు ప్రజల తరపున చంద్రబాబు అభినందనలు తెలిపారు. పాత కలెక్టర్లు కూడా తమ పనితీరును నిరూపించుకోవాలన్నారు. జిల్లా రూపు రేఖలు మార్చే అవకాశం కలెక్టర్లకు ఉంది. పాలసీ ఇవ్వడమే కాదు, అమలు చేయడం ముఖ్యం. పేదరిక నిర్మూలన లక్ష్యంగా పెట్టుకున్నాం భారత్‌ను ప్రథమ స్థానంలో నిలపాలి. మోదీ (Modi) ప్రధాని అయ్యాక 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్, నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారైంది. 1991కి ముందు సంస్కరణలు రాలేదు. అప్పుడు ఆర్థిక వృద్ధి రెండు లేదా మూడు శాతం ఉండేది. దేశ వృద్ధి రేటును చూసి అప్పుడు కొందరు ఎగతాళి చేసేవారు. టెక్నాలజీపై మాట్లాడితే అవహేళన చేశారు. సంస్కరణలపై మాట్లాడితే చాలా మంది వద్దన్నారు. ఆనాడు సంస్కరణలు వద్దన్న రాజకీయ పార్టీల మనుగడే ఇప్పుడు లేకుండా పోయిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం నిర్దిష్టమైన విధానంతో వికసిత్ భారత్-2047 తయారు చేసింది. మనం కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ -2047 రూపొందించాం. ఇది అధికారులకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ కావాలి. ప్రపంచంలో తెలుగువాళ్లు అగ్రస్థానంలో ఉండాలనేది నా ఆలోచన. సామాజిక న్యాయాన్ని పరిగణిస్తూ సమర్థతకు పెద్దపీట వేస్తున్నాం. డబుల్ ఇంజిన్ సర్కార్, డబుల్ డిజిట్ గ్రోత్ లక్ష్యంతో పనిచేస్తున్నాం. 2029 నాటికి రూ.29 లక్షల జీఎస్డీపీ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు పీ4 (P4) తీసుకొచ్చాం. ప్రధాని, సీఎం తర్వాత కలెక్టర్లే అత్యంత కీలకమైన వ్యక్తులు. ప్రభుత్వ విధానాలను సక్రమంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లదే అని అన్నారు.