Chandrababu:పీ4 అమలు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన పీ4 అమలు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ప్రారంభించారు. బంగారు కుటుంబాలు`-మార్గదర్శులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఉగాది (Ugadi) రోజు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ప్రభుత్వం బంగారు కుటుంబాలు, మార్గదర్శుల ఎంపిక ప్రక్రియ చేపట్టింది. పీ`4లో దాదాపు 13 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించింది. మార్గదర్శలుగా 1.40 లక్షల మంది పారిశ్రామికవేత్తలు, ప్రవాసాంధ్రులు ముందుకొచ్చారు. పీ4 ద్వారా హెచ్సీఎల్ కంపెనీలో ఉద్యోగం కల్పించడంతో భావోద్వేగానికి గురైన కృష్ణా జిల్లా వాసి పావని కంటతడిపెట్టుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ డొక్కా సీతమ్మ అంటే పేదల పెన్నిధి. అన్నదాతగా ఇప్పటికీ ప్రజల్లో గుర్తుండిపోయారు. మంచి కార్యక్రమం చేస్తే చరిత్ర గుర్తు పెట్టుకుంటుంది. సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక కార్యక్రమాలు చేశాను. జన్మభూమి, ప్రజల వద్దకు పాలన, శ్రమదానం వంటి కార్యక్రమాలు చేశాం. పచ్చదనం`పరిశుభ్రత, నీరు` మీరు వంటి అనేక కార్యక్రమాలు చేశాం. పేదరిక నిర్మూలన ఇప్పటిది కాదు, ఎన్టీఆర్ (NTR) సిద్దాంతమిది. ఆనాడు వెలుగు కార్యక్రమం తీసుకొచ్చాం. దీని ముఖ్య ఉద్దేశం పేదరిక నిర్మూలన, ఆర్థిక సంస్కరణ వల్ల సంపద సృష్టించడం చాలా సులభమైందన్నారు.
భూమిపై ఎవరూ శాశ్వతం కాదు, వెళ్లేటప్పుడు ఏం తీసుకెళ్లలేరు. మనుషులుగా బతకాలి, చనిపోయాక కూడా మనల్ని గుర్తు పెట్టుకునేలా పనులు చేయాలి. మానవత్వంతో మంచి సమాజం కోసం పనిచేయాలని కోరుతున్నా. మార్గదర్శుల చేయూతను బంగారు కుటుంబాలు అందిపుచ్చుకోవాలి. పీ4 కార్యక్రమం కింద దత్తత తీసుకోవడం స్వచ్ఛందమే. దీనిలో ఎలాంటి ఒత్తిడి లేదు. 15 లక్షల టార్గెట్ను త్వరలోనే చేరుకుంటాం అని అన్నారు. బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు సౌదీ అరేబియా(Saudi Arabia ) కు చెందిన పలువురు తెలుగువాళ్లు ముందుకొచ్చారు. కుప్పం (Kuppam) నియోజకవర్గానికి చెందిన 250 కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు తెలిపారు. దత్తతకు సంకేతంగా అడాప్ట్ ట్రీని బంగారు కుటుంబాలకు ఆయన అందజేశారు.







