Mahandu: టీడీపీలో వైసీపీ కోవర్టులున్నారా..? మహానాడు వేదికపై చంద్రబాబు(Chandrababu) మాటల అర్థమేంటి..?

ఇటీవలి కాలంలో టీడీపీ కార్యకర్తల హత్యలు జరుగుతున్నాయి. ఆపార్టీ కూటమి అధికారంలో ఉన్నప్పటికీ .. పలు జిల్లాల్లో సొంత కార్యకర్తలు హత్యకు గురికావడం.. నేతలను, అధినేత చంద్రబాబును సైతం కలవరపరిచిందని చెప్పవచ్చు. దీంతో అసలు పార్టీలో ఏం జరుగుతోందని ఆరా తీసిన చంద్రబాబు.. ఆవిషయాలను మహానాడు వేదికగా ప్రస్తావించారు. కొందరు పార్టీలో చేరినట్లు చేరి, తమ కార్యకర్తలను హత్యలు చేస్తున్నారని చెప్పారు. అలాంటి వారిని అస్సలు ఉపేక్షించేది లేదన్నారు చంద్రబాబు.
హత్యా రాజకీయాల్లో తలపండిన కొందరు వైసీపీ (YCP) నాయకులు కొందరు కోవర్టుల్ని టీడీపీ (TDP) లోకి పంపి వారి ఎజెండాను నెరవేర్చుకోవాలనుకుంటున్నారని, వాళ్ల ఆటలు …సాగనివ్వబోమని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తే అధినేతని, వాళ్లే తనకు హైకమాండ్ అని స్పష్టం చేశారు. ‘వలస పక్షులు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ కార్యకర్తే శాశ్వతం. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలి. అదే సమయంలో కోవర్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి’ అని పేర్కొన్నారు.
‘సంతనూతలపాడులో వీరయ్య చౌదరి, మాచర్ల నియోజకవర్గంలో ఇద్దరు టీడీపీ కార్యకర్తల హత్యలతో తనకు అనుమానం వచ్చిందన్నారు. కొంతమంది మన దగ్గర ఉంటూ వైసీపీకి కోవర్టులుగా హత్యా రాజకీయాలు చేస్తున్నారు. అలాంటివారిని ఉపేక్షిస్తే మన వేలితో మన కన్ను పొడుచుకున్నట్టే. కోవర్టుల్ని పంపి హత్యలు చేయించి.. టీడీపీలో వాళ్లను వాళ్లే చంపుకొంటున్నారని పార్టీకి చెడ్డపేరు తేవడం, వాళ్లు లక్ష్యంగా పెట్టుకున్నవారిని సులభంగా హతమార్చడం వైసీపీ ఉద్దేశం’ అని ఆయన మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలు ఎవరైనా ఇలాంటి తప్పులు చేసినా ఉపేక్షించబోనని స్పష్టం చేశారు.
కడప వేదికగా టీడీపీ మహానాడులో .. ‘నా తెలుగు కుటుంబం- ఆరు శాసనాలు’ అన్న అంశంపై మాట్లాడారు. ఈ ఆరు శాసనాలు గేమ్ ఛేంజర్ అవుతాయని, తెలుగువారి చరిత్రను తిరగరాస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆరు శాసనాలు ప్రవేశపెట్టిన లోకేశ్‌ను అభినందించారు. లోకేశ్ బాగా చదువుకున్నారని, ఆయన విజ్ఞానాన్ని ఇక్కడ ఉపయోగిస్తూ.. మహానాడును కొత్త దిశలో నడిపేందుకు శ్రీకారం చుట్టారని ప్రశంసించారు.