Chandrababu: ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు ఆహ్వానం
విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో సీఐఐ ఆధ్వర్యంలో జరిగే భాగస్వామ్య సదస్సుకు అధ్యక్షత వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ని ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్ర యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంలో భాగంగా దేశ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ పురోగతికి చేయూతనివ్వాలని కోరారు. లోకకల్యాణ్మార్గ్లోని నివాసంలో ప్రధానమంత్రిని కలిసి వివిధ అంశాలపై చర్చించారు. జీఎస్టీ (GST) రేట్ల తగ్గింపు నేపథ్యంలో కర్నూలులో ఈ నెల 16న నిర్వహించబోయే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను వివరించి ఆ కార్యక్రమానికి లాంఛనంగా ఆహ్వానించారు. విశాఖపట్నం కేంద్రంగా గూగుల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్‌కు సంబంధించి కుదుర్చుకోబోయే అవగాహన ఒప్పందం గురించి మోదీకి వివరించారు. దేశచరిత్రలోనే ఇదివరకూ ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌కు అతి భారీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావడానికి అవసరమైన అన్ని అనుమతులు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.













