జగన్ అవినీతి పరుడని కేంద్రమే అంటోంది.. అధికారంలోకి వస్తే అంతా కక్కిస్తాం: చంద్రబాబు
ఏపీ సీఎం జగన్పై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ధ్వజమెత్తారు. సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు వచ్చిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం తథ్యమని, దాన్ని ఎవరూ ఆపలేరని తేల్చిచెప్పారు. టీడీపీ కార్యకర్తలు ఉత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కుప్పంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తున్నామని చెప్పిన ఆయన.. ఎప్పుడో జమీందార్లు కట్టిన కోదండరాస్వామి దేవాలయాన్ని బాగు చేసే బాధ్యతను కూడా టీడీపీ తీసుకుంటుందని ప్రకటించారు. కోలార్ (కేజీఎఫ్) నుంచి కుప్పంకు మల్టీలేన్ రోడ్డు వేస్తామని, కనెక్టివిటీ రోడ్లు కూడా వేస్తామని హామీ ఇచ్చారు.
“మొన్ననే మేనిఫెస్టో ప్రకటించాం. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయసున్న ఆడవాళ్లకు నెలకు రూ.1500 ఆర్థిక సాయం అందిస్తాం. అర్హత ఉన్న స్త్రీలు ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ ఇస్తాం. నాన్న బుడ్డి పెట్టి అమ్మ ఒడిని దగా చేశాడు. ఎంతమంది పిల్లలున్నా ఒక్కరికే ఇస్తానంటాడు. కానీ మేం అలా కాదు. ఇంట్లో ఉన్న పిల్లలు అందరికీ తల్లికి వందనం పేరిట ఆర్థిక సాయం చేస్తాం. పిల్లల చదువును సులభతరం చేస్తాం. ఒక ఇంట్లో ముగ్గురు పిల్లలుంటే ఒక్కొక్కరికీ రూ.15 వేలు చొప్పున ముగ్గురికీ ఇస్తాం. ఆడబిడ్డలు బయటకు వెళ్లాలంటే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం’’ అని చంద్రబాబు తెలిపారు.
‘ఈ ముఖ్యమంత్రి అంత అవినీతిపరుడు ఇంకెక్కడా లేడని కేంద్ర హోంమంత్రి కూడా అన్నాడు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు కూడా అదే మాట చెప్పాడు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిమయం అని కేంద్రం పెద్దలే అంటున్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి కదా. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా దోపిడీ చేసి కూడబెట్టిన సొమ్మంతా కక్కిస్తాం. రూ.2 వేల నోట్లు రద్దు చేశాక ఈ దోపిడీదారులకు ఏంచేయాలో పాలుపోవడంలేదు. అందుకే ఆ నోట్లను వైన్ షాపుల్లో మార్చుకుంటున్నారు” అని చంద్రబాబు పేర్కొన్నారు.













