ప్రజల్లో మార్పు కనిపిస్తోంది.. దానిలో వైసీపీ కొట్టుకుపోతుంది: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్పై మాజీ సీఎం చంద్రబాబు తీవ్రమైన విమర్శలు చేశారు. జగన్ బట్టన్లు నొక్కి ప్రజలకు ఇచ్చే దాని కంటే, ఆయన నొక్కేసే డబ్బులే ఎక్కువ అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికలే వైసీపీకి చివరివని, తర్వాత రాష్ట్రంలో ఆ పార్టీ కనుమరుగు అవుతుందని చెప్పారు. సీఎం జగన్.. రాష్ట్రంలోని మైనార్టీలకు రంజాన్ తోఫా కూడా ఇవ్వట్లేదని, దుల్హన్ పథకాన్ని ఆంక్షల పథకంగా మార్చేసారని, తద్వారా అందే నగదలో భారీగా కోత పెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీ మాత్రమే ముస్లింల ఎదుగుదలకు పాటుపడిందని ఆయన స్పష్టంచేశారు. ఈ సందర్భంగా టీడీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులతో చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయించారు. ఏపీలో మార్పు మొదలైందని, అది ముస్లిం మైనార్టీల్లో స్పష్టంగా కనిపిస్తోందని, ఈ మార్పు పెను తుఫానుగా మారి వైసీపీని ముంచేస్తుంది అని చంద్రబాబు పేర్కొన్నారు.













