విశాఖలో చంద్రబాబు ప్రచారం
వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నగరాలు పతనమయ్యాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ చేరుకున్నారు. విమానాశ్రయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ సులభతర జీవన ర్యాంకింగుల్లో తిరుపతి స్థానం 4 నుంచి 46కు, విజయవాడ 9 నుంచి 41కు పడిపోవడం బాధాకరమన్నారు. ర్యాంకుల పతనం రాష్ట్రంలోని నగరపాలికల పరిస్థితికి అద్దపండుతోందని విమర్శించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైకాపాకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారని చెప్పారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, నేతలు వంగలపూడి అనిత, పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.













