ఏపీలో మళ్లీ టీడీపీనే రావాలి : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వమే రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతి రూరల్ మండలం పాడిపేటలో ఎన్టీఆర్ గృహాలను చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం సహకరించి ఉంటే రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందేదని అన్నారు. కేంద్రంపై పోరాడేందుకు జగన్, పవన్‌కు ధైర్యం లేదని ఎద్దేవా చేశారు. మరోవైపు తెలంగాణలో టీఆర్ఎస్కు వైసీపీ, జనసేన వంత పాడుతున్నాయని ధ్వజమెత్తారు. గోదావరి, కృష్ణా జిల్లాల కంటే రాయలసీమను అభివృద్ధి చేస్తానని తెలిపారు. అభివృద్ధిని ప్రతిపక్షాలు అడుగడుగునా అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. అయినా ఎవరెన్ని కుట్రలు చేసినా తనను ఏమీ చేయలేరన్నారు. తిరుపతి, చెన్నై, నెల్లూరు మధ్య సిలికాన్ కారిడార్ ఏర్పాటు చేస్తామన్నారు. గోదావరి నీళ్లు పెన్నాకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని సృష్టం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో దేశంలో మొదటి స్థానంలో ఉన్నామని పేర్కొన్నారు. తిరుపతిని ప్రపంచపటంలో పెట్టడమే తన లక్ష్యమని ఆశాభావం వ్యక్తం చేశారు. రూ.500 కోట్లతో తిరుపతిలో గరుడ వారధి పేరుతో ప్లైఓవర్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.













