Chandrababu: తెలంగాణ అభ్యంతరాలపై చంద్రబాబు క్లారిటీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల (Polavaram – Banakacharla) అనుసంధాన పథకంపై వివాదం రేగుతోంది. గోదావరి నది వరద జలాలను కృష్ణా నదికి మళ్లించి.. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీటి సౌకర్యం కల్పించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును సిద్ధం చేసింది ఏపీ సర్కార్. ఈ పథకం ద్వారా సముద్రంలోకి వృథాగా పోయే నీటిని ఉపయోగించుకుంటామని తెలిపింది. అయితే, ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) కడపలో జరిగిన టీడీపీ మహానాడులో (Mahanadu) ఈ అంశంపై స్పష్టమైన వివరణ ఇచ్చారు.
పోలవరం-బనకచర్ల పథకం గోదావరి నీటిని కొల్లగొట్టే ప్రయత్నంగా చిత్రీకరిస్తున్నారు బీఆర్ఎస్ (BRS) నేతలు. సముద్రంలో కలిసే 2వేల టీఎంసీల నీటిలో 200 టీఎంసీలను మాత్రమే వినియోగించుకుంటామని చంద్రబాబు చెప్పిన వ్యాఖ్యలను విమర్శిస్తున్నారు. ఈ ప్రాజెక్టు తెలంగాణకు (Telangana) నష్టం కలిగిస్తుందని, గోదావరి (Godavari) నీటి హక్కులపై ఆంధ్రప్రదేశ్ ఆధిపత్యం చెలాయిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై స్పందించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రంలోని ఎన్డీయే (NDA) కూటమిలో టీడీపీ భాగస్వామిగా ఉన్నందున ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉందని.. అదే జరిగితే తెలంగాణకు నష్టం జరుగుతుందనేది వాళ్ల వాదన.
అయితే… బీఆర్ఎస్ ఆరోపణలను చంద్రబాబు తోసిపుచ్చారు. మహానాడులో ఈ అంశంపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ గోదావరి నదిపై దిగువ రాష్ట్రంగా ఉందని, సముద్రంలోకి వృథాగా పోయే నీటిని మాత్రమే తాము వినియోగించుకోవాలని ప్లాన్ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదని, బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తాను తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టును ఎప్పుడూ వ్యతిరేకించలేదని, రెండు రాష్ట్రాలూ తనకు సమానమని, రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని చంద్రబాబు పేర్కొన్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి పంపిణీ విషయంలో గతంలోనూ వివాదాలు తలెత్తాయి. గోదావరి, కృష్ణా నదుల నీటి వాటాలపై రెండు రాష్ట్రాల మధ్య చర్చలు, ఒప్పందాలు జరిగాయి. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు కూడా గోదావరి నీటిని వినియోగించుకునే లక్ష్యంతో నిర్మితమైంది. చంద్రబాబు తాను కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోలేదని పేర్కొనడం ద్వారా, రెండు రాష్ట్రాల మధ్య సహకార వైఖరిని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. అయితే, బీఆర్ఎస్ నాయకులు ఈ ప్రాజెక్టు తెలంగాణలోని సాగు, తాగునీటి అవసరాలకు ఆటంకం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్ నాయకులు ఈ ప్రాజెక్టును రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ అబద్ధాలు చెబుతోందని, తెలంగాణ రాజకీయాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. పోలవరం-బనకచర్ల పథకం ఆంధ్రప్రదేశ్‌కు కీలకమైన ప్రాజెక్టు అయినప్పటికీ, తెలంగాణతో నీటి పంపిణీ విషయంలో సమన్వయం అవసరం. చంద్రబాబు తన వైఖరిని స్పష్టం చేస్తూ, రెండు రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. అయితే, బీఆర్ఎస్ అభ్యంతరాలు, రాజకీయ విమర్శలు ఈ అంశాన్ని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి రెండు రాష్ట్రాల మధ్య సంప్రదింపులు, కేంద్రం జోక్యం కీలకం కానుంది.