జెండాలు వేరైనా మా అజెండా ఒకటే.. చంద్రబాబు
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రజాగళం సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు తమ ధాటికి వైసీపీ వనికి పోతోంది అని పేర్కొన్నారు. ఈసారి ఏపీలో తమ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న పవన్ కళ్యాణ్ ని చూపిస్తూ ప్రజాగ్రహానికి వాయువు కూడా తోడైంది అంటూ సినిమా డైలాగులు వదిలారు. తణుకు సభ సాక్షిగా సైకిల్ స్పీడ్ కి ఎదురులేదని.. గ్లాసు జోరుకు తిరుగు లేదని.. కమలం వికాసానికి అసలు అడ్డే లేదని అన్నారు. ఈ రాష్ట్రాన్ని అరాచక పాలన నుంచి కాపాడడానికి మూడు పార్టీలు చేతులు కలిపాయని.. పార్టీల జెండాలు వేరైనా అజెండా మాత్రం ఒకటే అని చంద్రబాబు అన్నారు. పదేళ్ల క్రితం రాష్ట్ర విభజన జరిగినప్పుడు కష్టాలు పోగొట్టడం కోసం ఈ మూడు పార్టీలు ఒకటయ్యాయని.. తిరిగి మళ్ళీ ఇప్పుడు కబంధ హస్తాల నుంచి ఏపీని కాపాడడం కోసం ఒకటయ్యాయని చంద్రబాబు పేర్కొన్నారు.













