Vizag Steel : విశాఖ ఉక్కుకు ఆర్థిక ప్యాకేజీ.. కూటమికి ఊపిరి..!!
విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అనే నినాదంతో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటైంది. దశాబ్దాలపాటు ఇది నిరంతరాయంగా స్టీల్ ను ఉత్పత్తి చేస్తూ వస్తోంది. అయితే గత కొన్నేళ్లుగా స్టీల్ ఫ్యాక్టరీ (Vizag Steel) నష్టాల బాటలో పయనిస్తోంది. అప్పులు పేరుకుపోయాయి. అప్పులిచ్చిన కంపెనీలు కోర్టుల్లో దావాలు వేశాయి. మరోవైపు స్టీల్ ఉత్పత్తికి అవసరమైన ముడి ఇనుము (iron ore) , బొగ్గు (Coal) సరఫరా తగ్గిపోయాయి. దీంతో స్టీల్ ఉత్పత్తి కూడా తగ్గిపోయింది. నష్టాలను పూడ్చుకునే మార్గం లేకుండా పోయింది. జీతభత్యాలు కూడా చెల్లించలేని పరిస్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో కేంద్ర ప్రభుత్వమే ఆదుకోవాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.
ఏ కంపెనీ అయినా లాభాలు ఆర్జించాలనే ప్రారంభిస్తారు. కొంతకాలం నష్టాలు వచ్చినా భరిస్తారు. కానీ ఏటా నష్టాలు పూడ్చుకునేందుకు ప్రభుత్వం వైపు చూడడం సరికాదు. స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో ఇదే జరిగింది. వరుసగా నష్టాలబాట పట్టడంతో కంపెనీ నిర్వహణపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. వేలాది మంది ఉద్యోగులు, కుటుంబాలు ఈ కంపెనీపై ఆధారపడి బతుకుతున్నారు. కానీ దీన్ని గట్టెక్కించాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అందుకే దీన్ని ప్రైవేటీకరించాలని భావించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో కార్మికులు ఆందోళనబాట పట్టారు. దాదాపు రెండేళ్లుగా వాళ్లు ఉద్యమిస్తున్నారు.
మరోవైపు ఏపీలో కూటమి (NDA) ప్రభుత్వం అధికారంలోకి రావడం, అందులో బీజేపీ (BJP) భాగస్వామిగా ఉండడంతో స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించే సాహసం చేయలేకపోయింది. ఒకవేళ వేరే ప్రభుత్వం వచ్చి ఉంటే కచ్చితంగా ఈ కంపెనీని వదిలించుకునేదే. కానీ అధికారంలో ఉండగా ప్రైవేటీకరిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించిన బీజేపీ.. దీన్ని గట్టెక్కించేందుకు వివిధ మార్గాలను అన్వేషించింది. ఎవరైనా ఉద్యోగులు స్వచ్చందంగా తప్పుకోవాలనుకుంటే వాళ్లకు ప్యాకేటీ ప్రకటించింది. కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించింది. తక్కువ మంది ఉద్యోగులతో కంపెనీని నిర్వహించడం ద్వారా నష్టాల నుంచి బయటపడేయాలని ఆలోచించింది.
అందులో భాగంగా దాదాపు 18వేల కోట్ల అప్పల భారాన్ని మొదట తగ్గించాలనుకుంది. ఇప్పటికే వివిధ మార్గాల ద్వారా ఒకసారి రూ.500 కోట్లు, మరోసారి రూ.1150 కోట్లను అందించి ఆదుకుంది. ఇప్పుడు ఏకంగా రూ.11,500 కోట్ల ప్యాకేజీ అనౌన్స్ చేసేందుకు సిద్ధమైంది. ఇది కంపెనీ మళ్లీ గాడిన పడేందుకు ఎంతో దోహదపడుతుంది. ఇకపై ఉద్యోగులు కంపెనీని సక్రమంగా నిర్వహించుకోగలిగితే కంపెనీ మనుగడ సాగిస్తుంది. లేదంటే ప్రైవేటుపరం కావడం ఖాయం. ఇక రాజకీయంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కూటమి పార్టీలకు పెద్ద ఊరట ఇస్తుందని చెప్పొచ్చు. ఒకవేళ ప్రైవేటీకరించి ఉంటే టీడీపీ (TDP) , జనసేన (Janasena), బీజేపీలను (BJP)s నమ్మే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇప్పుడు ప్రైవేటీకరణ నుంచి తప్పించడమే కాకుండా ఏకంగా అప్పుల నుంచి బయటపడేందుకు ఆర్థిక సాయం చేయడం మాత్రం ఆ పార్టీలను కార్మికులు, వాళ్ల కుటుంబాలు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాయి.













