Visakhapatnam : విశాఖ ఉక్కు కోసం అవసరమైన సాయాన్ని అందిస్తాం : చంద్రబాబు
విశాఖ ఉక్కు కర్మాగారం (Visakhapatnam Steel Plant ) లో మూడో ఫర్నెస్‌ను తిరిగి ప్రారంభించే విషయాన్ని పరిశీలించాలని అధికారులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఆదేశించారు. ఉక్కు కర్మాగారాన్ని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉండవల్లిలోని నివాసంలో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కర్మాగారాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర కార్యచరణను రూపొందిస్తాయన్నారు. ప్లాంటు నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవడంతో పాటు, సామర్థ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. విశాఖ ఉక్కు కర్మాగారంతో రాష్ట్రానికి భావోద్వేగ అనుబంధం ఉంది. ప్లాంటు కోసం అడిగిన వెంటనే ఆర్థిక సాయాన్ని అందించడంలో ప్రధాని మోదీ (Prime Minister Modi) చొరవ చూపారు. రాష్ట్రం తరపున అవసరమైన సాయాన్ని అందిస్తాం అని అన్నారు. విశాఖ ఉక్కు కోసం కేంద్రం ప్యాకేజీ మంజూరు చేశాక పరిణామాలు, తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు చర్చించారు.
ఈ సమావేశంలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ (Bhupathiraju Srinivasa Varma), ఉక్కు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్, జాయింట్ సెక్రటరీ అభిజిత్ నరేంద్ర, ఎన్ఎండీసీ సీఎండీ అమితవ ముఖర్జీ, ఆర్ఐఎన్ఎల్ ఇన్‌ఛార్జి సీఎండీ అజిత్‌కుమార్ సక్సేనా, మెకాన్ సీఎండీ ఎస్కే వర్మ, ఎంఎస్టీసీ లిమిటెడ్ సీఎండీ మనోబేంద్ర ఘోషల్ పాల్గొన్నారు.













