ప్రత్యేక హోదా బదులుగానే ప్యాకేజీ : కేంద్రం
విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకు బదులుగానే ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇచ్చామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఇటీవల నీతి అయోగ్‌తో జరిపిన సమావేశంలో విజ్ఞప్తి చేసిన విషయం వాస్తవమేనని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వ పథకాలలో 90 శాతం కేంద్రం వాటా, 10 శాతం రాష్ట్ర వాటా ఉంటుందని ఆయన తెలిపారు. ఆ మేరకు పొందే ఆర్థిక ప్రయోజనాలను ప్రత్యేక ఆర్థిక సహాయం కింద ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరిన దరిమిలా రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించిందని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ పున వ్యవస్థీకరణ చట్టంలో నిర్దేశించిన హామీలను నెరవేర్చే బాధ్యత ఉన్నందున, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సాయపడాలని ఆర్థిక సంఘాలు, నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు సిఫార్సు చేశాయన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవసరమైన సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.













