కేంద్రంలో కూడా ఇక వైసీపీతో పని లేనట్టే..!!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే దక్కాయి. దీంతో అధికారాన్ని కోల్పోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. అయితే ఆ పార్టీకి మండలిలో బలముంది. మెజారిటీ సభ్యులు ఆ పార్టీ వాళ్లే. అలాగే కేంద్రంలోని రాజ్యసభలో కూడా వైసీపీకి 11 మంది సభ్యులున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి తమ అవసరం ఉంటుందని వైసీపీ భావిస్తూ వస్తోంది. కానీ వైసీపీ అంచనాలు తలకిందులయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల తర్వాత కేంద్రంలో కూడా వైసీపీ పని అయిపోయినట్లేనని భావించవచ్చు.
రాష్ట్రంలో ఓడిపోయినా కేంద్రంలోని బీజేపీకి తమ అవసరం ఉంటుందని వైసీపీ అంచనా వేస్తూ వచ్చింది. బీజేపీ కోసమే వైసీపీ ఏ కూటమిలోనూ చేరకుండా బయటి నుంచి ఆ పార్టీకి మద్దతు ఇస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు బీజేపీతో కలిసి టీడీపీ, జనసేన ప్రభుత్వంలో భాగస్వాములయ్యాయి. దీంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి. అయినా రాజ్యసభలో తమకు 11 మంది సభ్యులున్నారు కాబట్టి కచ్చితంగా బీజేపీకి తమ అవసరం ఉంటుందని గట్టి నమ్మకంతో ఉండేది. టీడీపీ, జనసేన భాగస్వాములైనా.. రాజ్యసభలో కీలక బిల్లులు పాస్ కావాలంటే కచ్చితంగా బీజేపీ తమ సాయం కోరుతుందని భావిస్తూ వస్తోంది. అయితే త్వరలో అలాంటి అవసరం లేకుండా పోయేలా కనిపిస్తోంది.
రాజ్యసభలో మొత్తం 245 స్థానాలున్నాయి. అయితే జమ్ముకశ్మీర్ లో ఎన్నికలకు జరగకపోవడంతో 4 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇవి పోనూ 241 స్థానాలున్నాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 9 రాష్ట్రాల్లో 12 సీట్లు ఖాళీ అయ్యాయి. ప్రస్తుతం 229 సీట్లు ఉండగా ఇందులో బీజేపీకి 87 మంది సభ్యులున్నారు. మొత్తం ఎన్డీయే బలం 105. నామినేటెడ్ పోస్టులతో కలిపితే ఎన్డీయే బలం 111 అవుతుంది. అంటే మెజారిటీకి కావాల్సిన 115కు కేవలం నాలుగు సీట్ల దూరంలో ఉంది. అయితే ఇప్పుడు ఖాళీ అయిన 12 స్థానాలకు సెప్టెంబర్ 3న ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 12 సీట్లలో 11 సీట్లను బీజేపీ, దాని మిత్రపక్షాలు గెలుచుకుంటాయని అంచనా. అదే జరిగితే ఎన్డీయే బలం 122కు చేరుతుంది. అప్పుడు 241 సీట్లున్న సభలో ఎన్డీయే కూటమికి స్పష్టమైన మెజారిటీ వచ్చినట్టే!
సెప్టెంబర్ 3 తర్వాత రాజ్యసభలో ఎన్డీయే కూటమికి పూర్తి మెజారిటీ రానుండడంతో వైసీపీ ఒంటరిగా మిగిలిపోనుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్డీయే కూటమిలో చేరే అవకాశం లేదు. అలాగని ఇండియా కూటమిలోకి వెళ్తే చిక్కులు కొని తెచ్చుకున్నట్టే. ఇటీవల ఢిల్లీలో ధర్నా సందర్భంగా ఇండియా కూటమి నేతలే జగన్ కు అండగా నిలిచారు. దీనిపై బీజేపీ ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. ఇలాంటప్పుడు ఇండియా కూటమి వైపు వెళ్తే మరిన్ని ఇబ్బందులు తప్పవనే ఆలోచనలే వైసీపీ ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఆ పార్టీ అధినేత జగన్ ఎలాంటి అడుగులు వేస్తారనేది ఆసక్తి కలిగిస్తోంది.













