Delhi: ఢిల్లీలో జగన్ కు కష్టమేనా..?
రాజకీయ పరిణామాలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. ఎప్పటికప్పుడు కీలక మార్పులు జరుగుతూ ఉంటాయి. వాటికి అనుగుణంగా నాయకత్వం కూడా మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో వైసీపీ వెనుకబడుతోంది. 2024 లో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత రాజకీయ పరిణామాలకు తగ్గట్టుగా వ్యవహరించడం లేదు అనే ఆవేదన ఆ పార్టీ కార్యకర్తల్లో వ్యక్తం అవుతుంది. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పార్టీ నాయకుల మానసికస్థైర్యం కూడా ఒకరకంగా దెబ్బతిన్నదనే చెప్పాలి.
అటు వైయస్ జగన్మోహన్ రెడ్డి(Ys Jagan) తీసుకుంటున్న నిర్ణయాలపై కూడా పార్టీలో కాస్త అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో వైసీపీ క్రమంగా పట్టు కోల్పోతుంది. రాజ్యసభ తో పాటుగా లోక్సభలో కూడా ఆ పార్టీ ఎంపీలు యాక్టివ్ గా ఉండకపోవడం ఆశ్చర్యపరిచింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఎంపీలు దూరంగా ఉన్నారు. వైయస్ అవినాష్ రెడ్డి ఎక్కువగా నియోజకవర్గంలోనే ఉండిపోయారు. మిథున్ రెడ్డిని లిక్కర్ కుంభకోణంలో ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
ఇక మిగిలిన ఎంపీలు పార్టీ అధిష్టానానికి కూడా సమాచారం ఇవ్వలేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. 2024 లో ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీకి 11 మంది ఎంపీలు మిగిలారు. ఆ తర్వాత నలుగురు ఎంపీలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, విజయసాయిరెడ్డి, ఆర్ కృష్ణయ్య రాజీనామా చేసి దూరంగా ఉన్నారు. అందులో ఇద్దరు టిడిపి(TDP)లో జాయిన్ కాగా, ఆర్.కృష్ణయ్య బిజెపిలో జాయిన్ అయ్యారు. ఇక విజయ సాయి రెడ్డి రాజకీయాలకు దూరమయ్యారు.
మిగిలిన ఎంపీలు అవినాష్ రెడ్డి దూకుడుగా వ్యవహరించలేని పరిస్థితి. వైఎస్ వివేకా కేసులో ఆయనపై సిబిఐ కన్నేసింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిగిన విచారణ తర్వాత అవినాష్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం సైతం జరుగుతుంది. ఇక మేడా రఘునాథరెడ్డి కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లికార్జున కర్గీతో భేటీ అయ్యారు. దీంతో ఆయన కూడా పార్టీ మారే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతోంది.
మరో రాజ్యసభ ఎంపీ పరిమల్ నత్వాని వైసీపీ కార్యక్రమాలకు ముందు నుంచి దూరంగానే ఉంటున్నారు. దీంతో క్రమంగా వైసిపి ఢిల్లీలో పట్టుకోల్పోతుంది. మిథున్ రెడ్డి లిక్కర్ కేసులో ఇబ్బంది పడటంతో, జగన్ తరుపున ఢిల్లీలో కీలకంగా వ్యవహరించే నాయకులు కనపడటం లేదు. విజయసాయిరెడ్డి ఉన్నప్పుడు వైసీపీకి ఆ సమస్య ఉండేది కాదు. విజయసాయిరెడ్డి రాజకీయాలనుంచి సైడ్ అయిపోవడం, మిగిలిన ఎంపీలకు అంతగా పట్టు లేకపోవడం వైసీపీని కలవరపెడుతోంది. అటు జగన్ కూడా ఢిల్లీ వెళ్ళడం లేదు. మరి ఈ సమస్యలను జగన్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.







