ఏపీలో మోదీ టూర్..! వైసీపీలో హడావుడి.. బీజేపీలో గందరగోళం..!!
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 11వ తేదీ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. మూడు నెలల వ్యవధిలోనే మోదీ రాష్ట్రంలో పర్యటించనుండడం విశేషం. అయితే.. ఈసారి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటుండడంతో విధానపరమైన అంశాలపై ప్రధాని మోదీ స్పందిస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్, రాజధాని అమరావతి.. లాంటి అంశాలపై ప్రధాని మోదీ స్పందనకోసం ఏపీ ప్రజానీకం మొత్తం ఎదురు చూస్తోంది. అయితే ప్రధాని పర్యటన ఏపీలో వైసీపీ, బీజేపీ మధ్య అగ్గి రాజేస్తోంది.
ఏపీలో ప్రధాని రాకకు జోరుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. నవంబర్ 11న ఆయన విశాఖలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. ముఖ్యంగా విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికైతే ఇది మాత్రమే అధికారికంగా ఖరారైన కార్యక్రమం. ఓ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు ప్రధాని హాజరుకావడమేంటి.. అనే సందేహాలు మొదలయ్యాయి. అయితే ఏపీలో బీజేపీ బలోపేతం కోసమే ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మోదీ, అమిత్ షా.. వ్యూహాత్మకంగా ఏపీపై దృష్టి పెట్టారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.
ఏపీలో ఇప్పుడు రాజకీయం మొత్తం రాజధాని చుట్టూ నడుస్తోంది. అధికార వైసీపీ 3 రాజధానుల నినాదంతో ముందుకెళ్తుండగా మిగిలిన పార్టీలన్నీ అమరావతికి కట్టుబడి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని మోదీ పర్యటన మరింత ఆసక్తి కలిగిస్తుంది. తమ పార్టీ అమరావతికే కట్టుబడి ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. మరి ఇదే అంశంపై ప్రధాని మోదీ స్పందిస్తారా.. అనేది చూడాలి. మరోవైపు.. బీజేపీతో జనసేన ప్రస్తుతం కలిసే ఉంది. ప్రధాని కార్యక్రమానికి జనసేన అధ్యక్షుడు హాజరవుతారా.. ప్రధానిని కలుస్తారా.. అనేదాని పైన కూడా స్పష్టత లేదు. ఆ మాటకొస్తే ప్రధాని పర్యటనపై వైసీపీకి తప్ప ఏపీ బీజేపీ నేతలకు కూడా పెద్దగా సమాచారం లేదని తెలుస్తోంది. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి దగ్గరుండి చూసుకుంటున్నారు. ప్రధాని షెడ్యూల్ ఏంటి.. ఏ ఏ కార్యక్రమాల్లో పాల్గొంటారు.. రైల్వే స్టేషన్ ఆధునీకరణకు మాత్రమే హాజరవుతారా.. లేదంటే ఇంకేదైనా షెడ్యూల్ లో ఉందా.. అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
ఒకవేళ ప్రధాని మోదీ అవకాశం ఇస్తే ఆయన్ను కలిసి రాష్ట్ర సమస్యలను వివరించేందుకు జనసేన, టీడీపీ సిద్ధంగా ఉన్నాయి. అయితే సొంత పార్టీ నేతలకే పూర్తి సమాచారం లేనప్పుడు తమకు అవకాశం లభిస్తుందని తాము భావించట్లేదని జనసేన, టీడీపీ చెప్తున్నాయి. అంతేకాదు.. పెద్ద పెద్ద కార్యక్రమాలను సైతం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ లు ద్వారా ప్రారంభిస్తున్నారు. అలాంటిది ఒక శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని వస్తారా.. అని ప్రశ్నిస్తున్నాయి. వైసీపీ హడావుడి చేస్తోంది తప్ప ప్రధాని టూర్ పై కేంద్రం అధికారికంగా ఇంతవరకూ ఎక్కడా ప్రకటన చేయలేదని.. కనీసం కేంద్ర బీజేపీ నేతలెవరూ కూడా మోదీ టూర్ పై స్పందించలేదని గుర్తు చేస్తున్నాయి. వైసీపీ మాత్రం మోదీ వస్తున్నారని.. హడావుడి చేస్తోంది. మోదీ టూర్ మొత్తం తమ ఘనతే అని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. మరి చూద్దాం.. ఏం జరుగుతుందో..!













