ఎన్నికల బరిలో దిగబోతున్న మాజీ మంత్రి నారాయణ!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలు సిద్ధమైపోతున్నాయి. ఇప్పటికే కొన్ని పార్టీలు అభ్యర్థులను కూడా ఖరారు చేస్తున్నాయి. ఈ విషయంలో టీడీపీ ముందుంది అని చెప్పొచ్చు. ఇప్పటికే వందకు పైగా స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసేసింది ఆ పార్టీ. తాజాగా నెల్లూరు సిటీ నియోజకవర్గానికి కూడా అభ్యర్థిని ఖరారు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. నెల్లూరు సిటీ నుంచి ఈసారి మాజీ మంత్రి పొంగూరు నారాయణ బరిలోకి దిగుతారని వెల్లడించారు.
నారాయణ విద్యా సంస్థల అధినేతగా పి.నారాయణ సుపరిచితులు. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే నారాయణకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి కేబినెట్లో చేర్చుకున్నారు చంద్రబాబు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పట్టణాభివృద్ధి, అర్బన్ హౌసింగ్ శాఖ మంత్రిగా నారాయణ బాధ్యతలు నిర్వర్తించారు. ముఖ్యంగా రాజధాని అమరావతికి అవసరమైన భూముల సేకరణలో నారాయణ పాత్ర కీలకం. రైతులను ఒప్పించి వారి నుంచి భూములు సేకరించడంలో, సీఆర్డీఏ రూపకల్పనలో నారాయణ ఎంతో కృషి చేశారు. అయితే ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఆర్డీఏ భూముల్లో అవకతవకలు జరిగాయంటూ నారాయణపై కేసు నమోదు చేసింది. ఇప్పడు కూడా ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు.
టీడీపీ ప్రభుత్వం దిగిపోయిన తర్వాతా నారాయణ రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. ప్రభుత్వం ఒకవైపు సీఆర్డీఏ భూముల వ్యవహారంలో కేసులు పెట్టడం, అదే సమయంలో నారాయణ విద్యాసంస్థల పైన కూడా దాడులు చేయడం.. నారాయణపైన ఒత్తిడి పెంచింది. దీంతో ఆయన పాలిటిక్స్ కు దూరంగా ఉండిపోయారు. ప్రభుత్వ వేధింపుల వల్లే ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారనుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణ నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. హైదరాబాద్ లో పార్టీ నేతల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం నెల్లూరు సిటీ నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి కూడా అనిల్ నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయడం ఖాయం. ఇప్పుడు టీడీపీ తరపున నారాయణ బరిలోకి దిగుతుండడంతో ఈ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారడం ఖాయం.













