Airports: ఆంధ్రప్రదేశ్‌కు ఇన్ని ఎయిర్ పోర్టులు అవసరమా..?
ఆంధ్రప్రదేశ్ (AP)లో టీడీపీ (TDP) ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మౌలిక సదుపాయాల కల్పనపై ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఆ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎయిర్ పోర్టుల విషయంలో చంద్రబాబు (Chandrababu) ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. జిల్లాకో విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో టీడీపీ పని చేస్తున్నట్టు అర్థమవుతోంది. తాజాగా అమరావతితో (Amaravati) పాటు శ్రీకాకుళంలో (Srikakulam) గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్ కు ఇన్ని విమానాశ్రయాలు అవసరమా అనే చర్చ జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం (Visakhapatnam), విజయవాడ (Vijayawada), తిరుపతి (Tirupati) విమానాశ్రయాలు ప్రధాన ఎయిర్ పోర్టులుగా గుర్తింపు పొందాయి. వీటికి అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాలుగా గుర్తింపు ఉంది. నిత్యం వేలాదిమంది ఇక్కడికి రాకపోకలు సాగిస్తున్నారు. ఇవి కాకుండా రాజమండ్రి (Rajahmundry), కడప (Kadapa), కర్నూలులో (Kurnool) కూడా ఎయిర్ పోర్టులున్నాయి. ఇక్కడి నుంచి వివిధ రాష్ట్రాలకు కనెక్టివిటీ ఉంది. అయితే రోజుకు నాలుగైదు సర్వీసులు కూడా ఇక్కడినుంచి అందుబాటులో లేవు. పుట్టపర్తిలో (Puttaparthi) ప్రవేట్ ఎయిర్ స్ట్రిప్ ఉంది. ప్రైవేటు సర్వీసుల కోసం దీన్ని వినియోగిస్తున్నారు. ఇలా చెప్పాలంటే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ ఇప్పటికే ఎయిర్ కనెక్టివిటీ అందుబాటులో ఉంది.
ఇవి కాకుండా రాష్ట్రంలో మరో 7 విమానాశ్రయాలను నిర్మించాలని ప్రభుత్వాలు ప్రతిపాదించాయి. కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, తుని-అన్నవరం, ఒంగోలులో ఎయిర్ పోర్టులు నిర్మించాలనే ప్రతిపాదన చాలాకాలంగా ఉంది. ఈ జాబితాలో ఇప్పడు అమరావతి కూడా చేరింది. ఇప్పటికే విజయవాడలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. దానికి కేవలం 30-35 కిలోమీటర్ల దూరంలోనే అమరావతి ఉంటుంది. అక్కడ మళ్లీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. విశాఖలో ఇప్పటికే ఎయిర్ పోర్టు ఉంది. అయితే అది నావికదళానికి చెందిన ప్రాంతం కావడంతో భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మిస్తోంది ప్రభుత్వం. ఇప్పుడు ఈ భోగాపురానికి 55 కిలోమీటర్ల దూరంలో శ్రీకాకుళంలో మరో ఎయిర్ పోర్టు నిర్మించాలని ప్రతిపాదించింది.
మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా విమానాశ్రయాలను (Airports) నిర్మించాలనే ఆలోచన మంచిదే. అయితే అవి ఎంతవరకూ లాభదాయకం అనే విషయం కూడా ఆలోచిస్తే బాగుంటుందనేది నిపుణుల సూచన. ఎందుకంటే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలు తప్ప మిగిలినవన్నీ ఇప్పటికీ నష్టాల్లోనే నడుస్తున్నాయి. గత మూడేళ్లలో రాష్ట్రంలోని ఆరు విమానాశ్రయాలు కలిపి రూ.455 కోట్ల నష్టాలను మూటగట్టుకున్నాయి. కడప, కర్నూలు విమానాశ్రయాలకు తాము విమానాలు నడపలేం అని విమానయాన కంపెనీలు చేతులెత్తేసిన సందర్భాలున్నాయి. ఉన్నవాటినే సక్రమంగా నడిపే పరిస్థితి లేనప్పుడు కేవలం 50-100 కి.మీ. దూరంలోనే కొత్త విమానాశ్రయాలను నిర్మించడం వల్ల లాభముంటుందా..? విమానయానరంగం అభివృద్ధి చెందవచ్చేమో కానీ రాష్ట్రానికి ఎంతవరకూ మేలు జరుగుతందనేది ఆలోచిస్తే బాగుంటుంది.













