కలిసి వెళ్తారా? కలుపుకు వెళ్తారా?
వైసీపీ సర్కార్ ను గద్దెదించడమే లక్ష్యమని జనసేన చెబుతోంది. దీనికి గానూ కూటమిగా ముందుకెళ్తామంటోంది. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి కూటమిగా ముందుకెళ్తామని జనసేనాని పవన్ ఇప్పటికే స్పష్టం చేశారు. హస్తినలో బీజేపీ పెద్దలకు ఇదే విషయాన్ని స్పష్టం చేశానన్న పవన్… అవసరమైతే ఒప్పిస్తామన్నారు. దీంతో విపక్ష వైసీపీ కూడా గట్టిగానే కౌంటర్ వేసింది. దమ్ముంటే సింగిల్ గా పోటీచేయాలని పవన్ కు తన బలమేంటో తెలుసని సజ్జల లాంటి నేతలు ఎద్దేవా చేశారు.
అయితే కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత వీరి వైఖరి ఎలా ఉండనుంది. ఎందుకంటే మోదీ కాలికి బలపం కట్టుకుని తిరిగి, ప్రచారం చేసినా కన్నడసీమలో కమలానికి ఘోరపరాభవం ఎదురైంది. మరీ ముఖ్యంగా తెలుగువారు ఉన్న ప్రాంతాల్లో వ్యతిరేక ఓటు పడింది. ఎంత పరాయి రాష్ట్రంలో బతుకీడుస్తున్నా, సొంతగడ్డపై మమకారం ఎక్కడికి పోతుంది. ఆంధ్రను అనాధను చేశారన్న కోపం .. అక్కడి సెటిలర్స్ లో కనిపించిందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ అస్తవ్యస్త విధానాలకు బీజేపీ హైకమాండ్ వత్తాసు పలుకుతోందన్న ఆక్రోశం కూడా వ్యతిరేక ఓటు రూపంలో వ్యక్తమైందని భావిస్తున్నారు.
ఇలాంటి సందర్భంలో బీజేపీతో కలిసి వెళ్తే పరిణామాలు ఎలా ఉండనున్నాయి. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీతో జట్టుకడితే.. ఆకోపం కాస్తా కూటమి ఓట్లపైనా ప్రభావం చూపిస్తుందా? గెలుపు ఖాయమనుకుంటున్న తరుణంలో.. వ్యతిరేక ఓటు కొంపముంచుతుందా? ఇప్పుడు ఇదే అనుమానం టీడీపీ, జనసేనను వేధిస్తున్నట్లు సమచారం. దీనికి తోడు కర్నాటక ఎన్నికల్లో ముస్లింలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా గంపగుత్తగా ఓటేశారు. ఇటీవల లోకేష్ యువగళం యాత్రకు ముస్లింల నుంచి మంచి స్పందన కనిపిస్తోంది.ఈ సందర్భంగా కొందరు లోకేశ్ ను.. బీజేపీతో పొత్తుగురించి అడిగినట్లు తెలుస్తోంది. ఎవరితో పొత్తు ఉన్నా.. తాము అందరికీ న్యాయం చేస్తూ ముందుకెళ్తామని లోకేష్ క్లారిటీ ఇచ్చారు. అయినా…ముస్లిం ఓటు బ్యాంకు దూరమవుతుందా అన్న అనుమానాలున్నాయి.
ఏపీలో బీజేపీ ఓటు బ్యాంకు స్వల్పం. అందులోనూ విభజన తర్వాత ఉన్న కాస్త అనుకూల వాతావరణం.. తీవ్రంగా దెబ్బతింది. కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజిస్తే..బీజేపీ దానికి సహకరించిందన్నది ఆంధ్రుల భావన. పోనీ తర్వాతైనా న్యాయం చేసిందా అంటే.. నీతి ఆయోగ్ పేరుతో కొత్త సంస్థను తెచ్చి, విభజన హామీలను అటకెక్కించింది. ముఖ్యంగా ప్రత్యేకహోదా అనే ఊసు లేకుండా చేసింది. దీంతో.. రాష్ట్రానికి బీజేపీ తీవ్ర అన్యాయం చేసిందన్నది సగటు ఆంధ్రుడి భావనగా ఉంది. ఈ పరిస్థితుల్లో బీజేపీని కూడా కలుపుకు వెళ్తారా? లేక టీడీపీ, జనసేన కలిసి వెళ్తాయా అన్న అంశంపై ఆసక్తి నెలకొంది.













