తెలంగాణకు ఇచ్చి ఏపీకి ఇవ్వరా?
తెలంగాణలో వెనుకబడిన జిల్లాలకు రూ.450 కోట్లు ఇచ్చి, ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించకపోవడం సమంజసమేనా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి సుజయకృష్ణ రంగారావు కేంద్రాన్ని ప్రశ్నించారు. 2017-18, 2018-19 సంవత్సరాలకు సంబంధించి వెనుక బడిన జిల్లాలకు వెంటనే రూ.700 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తున్నా, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు. కేంద్రంతో చేసుకున్న చీకటి ఒప్పందాలను వారు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బీజేపీ నేతలు అన్యాయం గురించి ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న జగన్, పవన్ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు.













