వైభవంగా మంత్రి అఖిలప్రియ వివాహం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ వివాహం హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త మద్దూరు భార్గవ్‌రామ్ నాయుడితో బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 10:57 గంటలకు అహోబిలం వేద పండితులు వేణుగోపాలన్ వివాహం జరిపించారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని భూమా శోభానాగిరెడ్డి మెమోరియల్ ఇంజనీరింగ్ కళాశాల ఇందుకు వేదికైంది. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మంత్రులు ఆది నారాయణరెడ్డి, కాల్వ శ్రీనివాసులు, నారాయణ, ఎంపీ ఎస్పి వైరెడ్డి, ఎమ్మెల్యే ఎస్వి మోహన్‌రెడ్డి, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, భూమా బ్రహ్మానందరెడ్డి, గౌరు చరితారెడ్డి, మణిగాంధీ, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మిల్క్డెయిరి చైర్మన్ భూమా నారాయణరెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, డిఐజి ఘట్టమనేని శ్రీనివాస్, కలెక్టరు సత్యనారాయణ, ఎస్పి గోపినాథ్‌జెట్టి, జెసీ ఎంవీ సుబ్బారెడ్డి, రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సులర్, భూమా కుటుంబీకులు, తదితరులు వివాహ వేడుకకు హాజరయ్యారు. కాగా, నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నర్ నరసింహన్ ఈ వివాహానికి హజరు కాలేదు.













