ఎచ్చెర్ల నుంచి చినబాబు పోటీ?
వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానంటూ మంత్రి, ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే చర్చ సాగుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి పట్టున్న ప్రాంతాల నుంచే రంగంలోకి దిగుతారన్నది ఒక అభిప్రాయం. ఈ నేపథ్యంలో నేతలు ఎవరికివారు తమతమ స్థానాలను త్యాగం చేసేందుకు రెడీ అవుతున్నారు. అనంతపురం, కృష్ణా జిల్లాల నుంచే పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. నిన్నటి వరకూ లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే తమ సీట్లు త్యాగం చేసేందుకు గతంలో మంత్రులు అమరనాథరెడ్డి, గంటా శ్రీనివాసరావు సిద్ధపడినట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. కానీ, తాజాగా మంత్రి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎచ్చెర్ల నుంచి లోకేష్ వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
ఇటీవల ముఖ్యమంత్రి ఇంటెలిజెన్స్ నివేదికలు రాష్ట్రంలో పది మంది మంత్రులకు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని ఇచ్చిన జాబితాలో కళావెంకటరావు ఒకరు కావడం ఒక కారణమైతే, ఆ నియోజకవర్గం కేడర్ నారా లోకేష్‌ను ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలంటూ ఆహ్వానించేందుకు అమరావతికి పయనం అవుతున్నట్టు తెలిసింది.తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత స్థానికుడిగా ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైంది కోండ్రు మురళీమోహన్ మాత్రమే. మిగిళిన అన్ని ఎన్నికల్లో కూడా స్థానికేతరులకే ఇక్కడ ఓటర్లు పట్టం కట్టారు. ఇదే సందర్భాన్ని టీడీపీ ముఖ్యనేతలు గుర్తుచేస్తూ చిన్నబాబును ఎచ్చెర్ల నియోజవర్గం నుంచి బరిలోకి దిగాలంటూ హైకమాండ్‌కు సంకేతాలు అందిస్తున్నారు.













