ఏపీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని అమరావతిలో ఆర్-5 జోన్ ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. ఇళ్ల నిర్మాణాలు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్-5 జోన్లో ఇళ్ల నిర్మాణాన్ని నిలువరించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హరిలతో కూడిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. రాజధానేతర ప్రాంత వాసులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చేందుకు అమరావతిలో ఆర్-5 జోన్ ఏర్పాటు, 1402 ఎకరాలను గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్లకు బదిలీ చేస్తూ ఇచ్చిన జీవోలు, ఇళ్ల నిర్మాణ ప్రక్రియను సవాల్ చేస్తూ రాజధాని ప్రాంత గ్రామాల రైతు సంక్షేమ సంఘాలు, రాయపూడి దళిత బహుజన సంక్షేమ ఐకాస హైకోర్టులో వ్యాజ్యాలు వేసిన సంగతి తెలిసిందే.













