PPP: మెడికల్ కాలేజీలపై చంద్రబాబు సర్కార్‌కు బిగ్ రిలీఫ్!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వైద్య కళాశాలల (AP Medical Colleges) అంశంపై రాజకీయ వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) విధానంలో పలు వైద్య కళాశాలలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీన్ని విపక్ష వైసీపీ (YCP) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు (AP High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో వైద్య కళాశాలలు నిర్మిస్తే తప్పేంటి? అని ప్రశ్నించింది. ఇందులో న్యాయస్థానం జోక్యం చేసుకోలేదని స్పష్టం చేసింది. ప్రభుత్వం పిలిచిన టెండర్లపై స్టే ఇవ్వడానికి కూడా హైకోర్టు నిరాకరించింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవిలతో కూడిన ధర్మాసనం మెడికల్ కాలేజీల అంశంపై విచారణ చేపట్టింది. పీపీపీ విధానం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, రాజ్యాంగం లేదా చట్టాన్ని ఉల్లంఘించే నిర్ణయాల్లో తప్ప న్యాయస్థానం జోక్యం చేసుకోదని పేర్కొంది. పూర్తిగా ప్రైవేటుకు అప్పగించడం కాకుండా ప్రభుత్వ భాగస్వామ్యం ఉండడం మంచిదే కదా అని ధర్మాసనం అభిప్రాయపడింది. నిధుల కొరత కారణంగా ప్రభుత్వం పీపీపీ విధానాన్ని ఎంచుకొని ఉండవచ్చని., అది తప్పెలా అవుతుందని ప్రశ్నించింది. నిధులున్నప్పుడే కట్టాలంటే ఎన్నేళ్లు పడుతుంది.. అని ధర్మాసనం నిలదీసింది. నిధుల లేమితో జిల్లాల్లో కోర్టు భవనాలు కూడా నిలిచిపోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో ముందుకు రావడం సమంజసమేనని పేర్కొంది. ప్రభుత్వ వైద్య కళాశాలల అభివృద్ధి కోసం ఇలాంటి అంశాల్లో నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ప్రభుత్వం జారీ చేసిన జీవో 590పై గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన సామాజిక కార్యకర్త డాక్టర్ కుర్రా వసుంధర పిల్ దాఖలు చేశారు. పిల్ తరఫున సీనియర్ న్యాయవాది శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ, ప్రజాప్రయోజనాలను పణంగా పెట్టి వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తున్నారని, 33 ఏళ్ల పాటు ప్రైవేటు సంస్థలు కళాశాలల నిర్వహణ చేస్తాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. గత ప్రభుత్వ హయాంలో 12 వైద్య కళాశాలలకు రూ.5,800 కోట్లతో పరిపాలనపరమైన అనుమతులు ఇచ్చారని వివరించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, పరిపాలనపరమైన అనుమతులు ఇచ్చారనే మాట సరిపోదని, నిధులు కూడా విడుదల చేయాలి కదా? అని అడిగింది. అంత పెద్ద మొత్తాన్ని ప్రభుత్వం ఖర్చు చేయగల స్థితిలో ఉందా? అని ప్రశ్నించింది.
రాష్ట్రంలో ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం వైద్య కళాశాలలను ప్రభుత్వ – ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్ 9న జీవో 590 ద్వారా నిర్ణయించింది. ఈ కళాశాలల నిర్మాణ పనులను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌లో నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో చీఫ్ సెక్రటరీ, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, APMSIDC ఎండీ, వైద్య విద్యా పరిశోధన సంస్థ ఎండీలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 29కి వాయిదా వేసింది.