ఏపీ సీఎస్ ను సత్కరించిన సీఎం జగన్
ఆంధప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నీలం సాహ్ని ఈ నెల ఆఖరికి తన పదవి విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీఎస్ నీలం సాహ్నిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా సత్కరించారు. కేబినెట్ సమావేశంలో సీఎం జగన్‌తో పాటు మంత్రి మండలి సభ్యులు ఆమెను సత్కరించారు. కాగా 2019 నవంబర్ 14న ఏపీ సీఎస్‌గా నీలం సాహ్ని పదవి బాధ్యతలు చేపట్టారు. విభజన తర్వాత ఏపీ తొలి మహిళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని నియమితులయ్యారు. సాహ్ని 2018 నుంచి ఇప్పటి వరకూ కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ కార్యదర్శిగా వ్యవహరించారు.
1984వ ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సాహ్ని ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో మచిలీపట్నం అసిస్టెంట్ కలెక్టర్‌గా పని చేశారు. టెక్కలి సబ్ కలెక్టర్‌గా, నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. మున్సిపల్ పరిపాలన విభాగం డిప్యూటీ సెక్రటరీగా, స్త్రీ శిశు సంక్షేమశాఖ పీడీగా పని చేశారు. నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లోనూ పని చేసిన సాహ్ని.. నల్గొండ జిల్లా కలెక్టర్‌గా, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శిగా పని చేశాక.. ఎపీఐడీసీ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీగా ఉమ్మడి రాష్ట్రంంలో పని చేశారు. అనంతరం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. 2018 నుంచి ఇటీవల వరకు కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారిత కార్యదర్శిగా పనిచేశారు.













