15న ఏపీ సీఎం అమెరికా పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 15న కుటుంబంతో కలిసి అమెరికా పర్యటనకు వెళుతున్నారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తర్వాత అదే రోజు ఆయన హైదరాబాద్ వెళ్తారు. అక్కడి నుంచి కుటుంబ సభ్యులతో రాత్రికి శంషాబాద్ విమానాశ్రయం నుంచి అమెరికా బయలుదేరతారు. ముఖ్యమంత్రి చిన్న కుమార్తె వర్షా రెడ్డిని అమెరికాలోని ఒక ప్రముఖ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్ కోర్సులో చేర్పించేందుకు వెళుతున్నారని సమాచారం. 17న డల్లాస్లో కే బెయిలీ హచిసెన్ కన్వెన్షన్ సెంటర్లో ఉత్తర అమెరికాలోని తెలుగు ప్రజలతో జరిగే ఆత్మీయ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొంటారని వైఎస్సార్సీపీ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 24న తాడేపల్లికి తిరిగి వస్తారు.













