ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు : చంద్రబాబు
తెలుగువారి చరిత్ర ఉన్నంత వరకు శాశ్వతంగా గుర్తు పెట్టుకొనే నటుడు దివంగత ఎస్వీ రంగారావు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీర్తించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలపర్రు టోల్గేటు సమీపంలోని వై జంక్షన్ వద్ద ఆయన విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఎస్వీఆర్లా సంభాషణలు పలికించే వ్యక్తి గతంలో లేరని, రాబోయే కాలంలో ఉండబోరని అన్నారు. ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఆ మహానటుడి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం తన పూర్వ జన్మ సుకృతమని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న నటుడు ఎస్వీ రంగారావు అని కొనియాడారు. ఆయన నటించిన అనేక చిత్రాల్లో తనదైన నటనా శైలితో తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. ఎస్వీ రంగరావు విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రాంతంలోనే మ్యూజియం ఏర్పాటు చేసి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.













