జూన్ కు సిద్ధంకండి.. నీరిచ్చేద్దాం!
‘పోలవరం’ పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశం
చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాల తరలింపుపై అభినందన
ఈ ఏడాది జూన్ నాటికి ఎట్టిపరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు నుంచి గ్రావిటీ ద్వారా నీరు అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జలవనరుల శాఖ ఉన్నతాధికారులకు, నిర్మాణ సంస్థలకు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇందుకు అనుగుణంగా కాంక్రీట్ పనులు, తవ్వకం పనులు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ సెలవులు కావడంతో లక్ష్య సాధనలో కాస్త వెనుకబడినట్టు అధికారులు వివరించగా, ఏప్రిల్ నెలాఖరు నాటికి తవ్వకం పనులు పూర్తికావల్సిందేనని ముఖ్యమంత్రి ఆదేశించారు.
సోమవారం సచివాలయంలో పోలవరం ప్రాజెక్టుపై 85వ సారి ముఖ్యమంత్రి వర్చువల్ రివ్యూ నిర్వహించారు. ఇప్పటివరకు 64.31% వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 36.79 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను 22.71 లక్షల క్యూబిక్ మీటర్లు(61.70%) మేర కాంక్రీట్ పనులు చేపట్టినట్టు తెలిపారు. అలాగే తవ్వకం పనులు మొత్తం 1115.59 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను 945.56 క్యూబిక్ మీటర్లు (84.80%) వరకు పూర్తయ్యాయని చెప్పారు. కుడి ప్రధాన కాలువ 90%, ఎడమ ప్రధాన కాలువ 67.37%, రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 62.64%, కాఫర్ డ్యామ్ పనులు 14.45% పూర్తియినట్టు వెల్లడించారు. గతవారం స్పిల్ వే, స్పిల్ చానల్, పైలట్ చానల్, అప్రోచ్ చానల్, లెఫ్ట్ ఫ్లాంక్‌కు సంబంధించి 3.19 లక్షల క్యూబిక్ మీటర్లు మేర తవ్వకం పనులు పూర్తయ్యాయని, స్పిల్ వే, స్పిల్ చానల్, స్టిల్లింగ్ బేసిన్‌కు సంబంధించి 44 వేల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ పనులు పూర్తయ్యాయని చెప్పారు.
పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు మొత్తం రూ.15,585.17 కోట్లు ఖర్చు చేయగా, జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత రూ.10,449.30 కోట్లు ఖర్చు పెట్టినట్టు అధికారులు చెప్పారు. ఈ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా రూ.3,722.04 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. మరోవైపు గతేడాది ఏప్రిల్ 23 నుంచి ఈనెల 13 వరకు మొత్తం 272 రోజుల్లో 5,02,295 మంది రైతులు, విద్యార్ధులు, సామాన్యప్రజలు పోలవరం ప్రాజెక్టును సందర్శించారని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు సమీపంలో ఉన్న కొండలపై రిసార్టులు, హోటళ్లు నిర్మించడం ద్వారా పర్యాటక కేంద్రంగా మార్చాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.
ఎనర్జీ ఎన్విరాన్మెంట్ ఫౌండేషన్ నుంచి ‘గ్లోబల్ హెచ్ఆర్ స్కిల్ డెవలప్మెంట్’ విభాగంలో ప్లాటినం పురస్కారం అందుకున్నందుకు, అలాగే చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాలు తరలించినందుకు జలవనరుల శాఖ అధికారులను, ఉద్యోగులను ముఖ్యమంత్రి అభినందించారు.
సమీక్షలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్, ముఖ్యమంత్రి కార్యదర్శి ఏవీ రాజమౌళి, పోలవరం ఆర్&ఆర్ కమిషనర్ రేఖారాణి, ఈఎన్సీ వెంకటేశ్వరావు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.













