ఏపీ కేబినెట్ భేటీ…. కీలక నిర్ణయాలు ఇవే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ పెన్షన్ విధానంపై బిల్లు రూపొందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ బిల్లు-2023 పేరుతో కొత్త పెన్షన్ విధానం అమలుకు మంత్రివర్గంలో నిర్ణయించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, 12వ పీఆర్సీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కొత్త మెడికల్ కళాశాలల్లో 706 పోస్టుల భర్తీకి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. చిత్తూరు డెయిరీ ప్లాంట్‌కు 28 ఎకరాల భూమిని లీజు ప్రాతిపదికన ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. ఏపీ పౌరసరఫరాల కార్పొరేషన్ ద్వారా రూ.5 వేల కోట్ల రుణ సేకరణకు కేబినెట్ అనుమతించింది.
జగనన్న అమ్మ ఒడి పథకం అమలులను జూన్ 28 తేదికి వాయిదా వేస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. 18.58 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు స్మార్ట్ మీటర్ల బిగింపునకు రూ.6,888 కోట్లను వ్యయం చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ నెట్ కోసం రూ.455 కోట్ల రుణాల కోసం ఏపీ ఎఫ్ఎస్ఎల్కు అనుమతిస్తూ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. జూన్ 12 నుంచి 17 వరకు జగనన్న విద్యా కానుక వారోత్సవాల నిర్వాహణకు, పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు జగనన్న ఆణిముత్యాలు అవార్డులు ప్రదానం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.











































































