గ్రీన్ ఎనర్జీ దిశగా ఆంధ్రప్రదేశ్ అడుగులు: మంత్రి గొట్టిపాటి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్‌ను ‘గ్రీన్ ఎనర్జీ రాష్ట్రం’గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్(Gottipati Ravi kumar) స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన’ (PM Surya Ghar: Muft Bijli Yojana) పురోగతిపై కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విద్యుత్ శాఖ మంత్రులతో ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి, ఆంధ్రప్రదేశ్‌లో సోలార్ ఎనర్జీ రంగంలో సాధిస్తున్న ప్రగతిని మరియు భవిష్యత్ కార్యాచరణను కేంద్రానికి వివరించారు. దేశవ్యాప్తంగా కోటి కనెక్షన్ల మార్కును చేరాలన్న కేంద్రం పిలుపునకు అనుగుణంగా ఏపీ యంత్రాంగం వేగంగా కదులుతోందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ‘పీఎం సూర్యఘర్’ పథకం అమలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో నిలిచిందని, త్వరలోనే అన్ని రాష్ట్రాలను అధిగమించి మొదటి స్థానానికి చేరుకోవడమే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని మంత్రి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
రాష్ట్రంలో రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటును మరింత వేగవంతం చేసేందుకు మరియు సామాన్య ప్రజలకు ఈ పథకాన్ని మరింత సులభంగా చేరవేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి వివరించారు. ఇదే సమయంలో పథకం అమలులో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న కొన్ని సవాళ్లను మంత్రి గొట్టిపాటి రవికుమార్ కేంద్రం దృష్టికి తీసుకువచ్చారు.
పీఎం సూర్యఘర్ లబ్ధిదారులకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు బ్యాంకులు కచ్చితంగా 5.75 శాతం వడ్డీ రేటుకే రుణాలు మంజూరు చేసేలా కేంద్ర ప్రభుత్వం తగిన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. తక్కువ వడ్డీకి రుణాలు అందితే మరింత మంది వినియోగదారులు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు వైపు మొగ్గు చూపుతారని, తద్వారా కేంద్రం నిర్దేశించిన కోటి కనెక్షన్ల టార్గెట్‌ను సులువుగా రీచ్ అవ్వొచ్చని మంత్రి పేర్కొన్నారు. ఏపీని గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మార్చేందుకు కేంద్రం నుంచి పూర్తి స్థాయి సహకారం అందించాలని కోరారు.








