పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరి ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్దకు వస్తూ హెలికాప్టర్ నుంచి స్పిల్‌వే సహా వివిధ ప్రాంతాలను ఆయన వీక్షించారు. ప్రాజెక్టు సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథితో పాటు ఎమ్మెల్యేలు, టీడీపీ ముఖ్య నేతలు చంద్రబాబుకు స్వాగతం పలికారు. అనంతరం ప్రాజెక్టు వద్ద చేరుకుని అధికారులతో మాట్లాడారు. ప్పిల్వే, కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతిపై జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వారితో కలిసి బస్సులో ప్రాజెక్టు పరిసరాలను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించారు. గతంలో ఎడమగట్టు వద్ద కుంగిన గైడ్‌బండ్ ప్రాంతాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. 22, 23 గేట్ల నుంచి ప్రాజెక్టు పరిసరాలను చూశారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి పర్యటన ఇదే. 2014`19 మధ్య సోమవారాన్ని పోలవారంగా పిలుస్తూ క్రమం తప్పకుండా ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించి పనుల పురోగతిని పర్యవేక్షించారు. అదే తరహాలో ఇప్పడూ సోమవారం రోజునే ప్రాజెక్టు సందర్శనను మొదలు పెట్టారు.













