ఏపీ సర్కార్ నిర్ణయాన్ని తప్పు బట్టిన హైకోర్టు
విద్యా సంస్థల కోసం ఇచ్చిన భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించటాన్ని హైకోర్టు తప్పుబట్టింది. విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ భూములను ఇళ్ల పట్టాలకు ప్రభుత్వం కేటాయించింది. ఈ వ్యవహారంపై హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. న్యాయవాది తాండవ యోగేష్ దాఖలు చేసిన ఈ పిటిషన్పై విచారించిన హైకోర్టు, ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేసింది. రాష్ట్రంలో ఎక్కడా విద్యా సంస్థల భూములు ఇళ్ల పట్టాలకు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలకు సంబంధించిన స్థలాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని ఆదేశాల్లో పేర్కొంది. అంతేగాక దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది.













