యాంకర్ శ్యామలకు వైసీపీలో కీలక బాధ్యతలు..! ఇక రచ్చ రచ్చే..!!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యల్లో ఉంది. పార్టీన్ని పునర్నిర్మించేందుకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారు. జిల్లాల వారీగా నేతలతో సమావేశమవుతున్నారు. కొంతమంది నేతలు పార్టీని వీడడం, వీడేందుకు మరికొంత మంది సిద్ధంగా ఉండడంతో కొత్తరక్తం నింపేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా కొన్ని నియామకాలను కూడా ఆయన ఈ మధ్యకాలంలో చేపట్టారు. అందులో అధికార ప్రతినిధుల నియామకం కూడా ఒకటి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం మాజీ మంత్రి ఆర్కే రోజా, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్, ఆరె శ్యామలను అధికార ప్రతినిధులుగా నియమించింది. ఇందులో మొదటి ముగ్గురూ సుపరిచితులే. అయితే ఈ ఆరె శ్యామల ఎవరని అందరూ ఆరా తీయడం మొదలు పెట్టారు. ఆరె శ్యామల అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ యాంకర్ శ్యామల అంటే మాత్రం ఠక్కున గుర్తు పట్టేస్తారు. ఎస్.. యాంకర్ శ్యామలను వైసీపీ అధినేత జగన్ అధికార ప్రతినిధిగా నియమించారు. దీంతో శ్యామల ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టినట్లయింది.
బుల్లితెరపై యాంకర్ పై, సిల్వర్ స్క్రీన్ పై నటిగా శ్యామల తెలుగు ప్రజలకు సుపరిచితులు. ఆమె వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలు. శ్యామల భర్త నరసింహారెడ్డి కడప జిల్లా వాసి. ఆయన కూడా గతంలో నటుడే. శ్యామల బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన గోదావరి జిల్లా వాసి. భర్త రెడ్డి సామాజిక వర్గానికి చెందుతారు. శ్యామల ఇప్పటికీ సినీ రంగంలో ఉన్నారు. అయితే ఈ కుటుంబం ఎంతోకాలం వైఎస్ జగన్ కు సన్నిహితంగా ఉంటోంది. అలాగే వైఎస్ షర్మిలతో కూడా సన్నిహిత సంబంధాలున్నాయి. వైసీపీకోసం శ్యామల ప్రచారం కూడా నిర్వహించారు. ఇటీవలి ఎన్నికల్లో కూడా ఆమె ఆ పార్టీ అభ్యర్థుల తరపున పని చేశారు.
పిఠాపురంలో పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా శ్యామల ప్రచారం చేయడం ఆయన అభిమానులకు నచ్చలేదు. దీంతో శ్యామలను సోషల్ మీడియాలో టార్గెట్ చేశారు. వ్యక్తిగతంగా ట్రోల్ చేశారు. అయినా ఆమె వెనక్కు తగ్గలేదు. తనకు నచ్చిన పార్టీకి, వ్యక్తికి ప్రచారం చేస్తే ఇలా ట్రోల్ చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏకంగా ఆమెను పార్టీ అధికార ప్రతినిధిగా నియమించడం సంచలనం కలిగించింది. పార్టీకోసం నేరుగా పని చేస్తే సినిమా రంగంలో అవకాశాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. అదే సమయంలో విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతాయి. అయినా అధికార ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టేందుకు ఆమె ముందుకు రావడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లూ పరోక్షంగానే మద్దతుగా ఉన్న శ్యామల.. ఇక పొలిటికల్ స్క్రీన్ పై రచ్చ చేయబోతున్నారు.













