కోర్టు వాయిదాలకు అలవాటు పడ్డ సీఎం.. ఫలితాలు వాయిదా వేస్తారా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోర్టు వాయిదాలకు అలవాటుపడ్డారని, అదే విధంగా పదో తరగతి ఫలితాలను కూడా వాయిదా వేస్తారా? అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. పదో తరగతి ఫలితాలు చివరి నిమిషయంలో ఎందుకు వాయిదా వేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అసమర్థ పాలనతో విద్యార్థుల భవిష్యత్తో ఆటలాడుతారా? అని వ్యాఖ్యానించారు. మద్యం వ్యాపారం చేసుకునే వ్యక్తికి విద్యాశాఖ మంత్రిని చేశారని మండిపడ్డారు. విజయనగరం జిల్లాలో ఉన్న తన వైన్ షాపుల సంఖ్య తప్ప రాష్ట్రంలోని పాఠశాలల సంఖ్య మంత్రి బొత్స సత్యనారాయణకు తెలుసా? అని అడిడారు. సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాలతో విద్యార్థుల భవిష్యత్తో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు దిగజారి పోయాయని ధ్వజమెత్తారు. నాడు నేడు పేరుతో కమీషన్లు దండుకోవటం తప్ప రాష్ట్రంలో విద్యాభివృద్ధికి జగన్ చేసిన కృషి శూన్యమని విమర్శించారు.











































































