వైసీపీకి 175 స్థానాలు వస్తే.. టీడీపీ కార్యాలయానికి

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 175 స్థానాలు వస్తే టీడీపీ కార్యాలయానికి తాళాలు వేస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 175 స్థానాలు ఎందుకు రాకూడదంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై అచ్చెన్నాయుడు స్పందించారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 175 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ గెలుస్తుందనే నమ్మకం జగన్‌కు ఉంటే ఇప్పుడే ఎన్నికలకు వెళ్లాలని అన్నారు. గవర్నర్‌ను కలిసి ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఏం చేశారని 175 స్థానాల్లో వైసీపీని ప్రజలు గెలిపిస్తారని ప్రశ్నించారు. ప్రజలు మళ్లీ జగన్‌కే ఓట్లేసేంత అమాయకులు కాదన్నారు. నారా లోకేశ్ జూమ్ సమావేశంలో వైసీపీ వాళ్లు దొంగల్లా చొరబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను భయపెట్టి జూమ్ మీటింగ్‌లోకి వచ్చారని ఆరోపించారు. జూమ్ కాన్ఫరెన్స్‌లోకి వచ్చిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.











































































