రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా? : అచ్చెన్న

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. టీడీపీ నేత మునెప్ప ఆస్తులు ఆక్రమించి తిరిగి దాడి చేస్తారా అని మండిపడ్డారు. జగన్ పాలనలో ప్రజల మాన ప్రాణాలకు రక్షణ కరువైందని విమర్శించారు. జగన్ రెడ్డి పాలనలో అరాచకానికి, అకృత్యాలకు కేరాఫ్ అడ్రస్‍గా ఏపీ మారిందన్నారు. రోజుకో హత్య, గంటకో విధ్వంసం రాష్ట్రంలో నిత్యకృత్యమైపోయాయని తెలిపారు. భూమి కబ్జా చేసి, అడ్డుకున్నందుకు హతమార్చాలని ప్రయత్నిస్తారా అని ప్రశ్నించారు.
జగన్ రెడ్డి ఫ్యాక్షన్ పాలనలో ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ కరువైందన్నారు. జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో రక్తం ఏరులై పారుతూనే ఉందని అన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చింది పేదల ఆస్తుల్ని ఆక్రమించడానికా అని మండిపడ్డారు. ప్రజలు ప్రాణాలు పోతున్నా తాడేపల్లి బాలింత బయటకు రాకపోవడం సిగ్గుచేటని అన్నారు. దాడులు జరగని రోజు, విధ్వంసం చోటుచేసుకోని ప్రాంతం లేదన్నట్లుగా రాష్ట్రం తయారైందన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యం, వైకాపా నేతల ఇష్టారాజ్యంతో ప్రజలు స్వేచ్ఛగా బతకలేకపోతున్నారన్నారు. రాష్ట్రాన్ని రావణ కాష్టంలా జగన్ నిత్యం మండిస్తూనే ఉన్నారని విమర్శించారు.