ఏపీ నుంచి వచ్చే వారిపై ఆంక్షలు ఎందుకు?

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్440కే అనే కొత్త రకం కొవిడ్-19 వైరస్ వ్యాప్తి తీవ్రత లేకపోతే పొరుగు రాష్ట్రాలు ఆంధప్రదేశ్ నుంచి వచ్చే వారిపై ఆంక్షలు ఎందుకు విధిస్తున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రజల ప్రాణాల కంటే ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. కరోనా తీవ్రతపై హైకోర్టు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పగలదా? అని ప్రశ్నించారు. ఆంధప్రదేశ్ నుంచి వచ్చే వారు 14 రోజులు క్వారంటైన్‍లో ఉండాలని ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాలు ఆంక్షలు ఎందుకు పెట్టాయన్నారు. 18-45 ఏళ్ల మధ్య వారికి వ్యాక్సిన్ ఇవ్వాలనే కేంద్ర మార్గదర్శకాలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇకనైనా తప్పిదాలు కప్పిపెట్టకుండా ప్రతిపక్షాలు, శాస్త్రవేత్తలు, న్యాయస్థానాలు ఇచ్చే సలహాలు, సూచనలు పాటించాలని హితవు పలికారు.