సెప్టెంబర్ 1 నుంచి బాబు ష్యూరిటీ.. భవిష్యత్ గ్యారెంటీ
వైసీపీ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పవిత్రతను మంటగలిపారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీ చైర్మన్‌గా క్రైస్తవుడిని నియమించారని, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అభియోగాలు ఎదుర్కొంటున్న శరత్‌చంద్రారెడ్డిని బోర్డు సభ్యుడిగా ఎంపిక చేశారని విమర్శించారు. సీఎం జగన్ పెట్టిన కష్టాలు మర్చిపోకుండా కార్యకర్తలు మరింత కసితో పని చేయాలన్నారు. ఇసుక సత్యాగ్రహం పేరుతో ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. సెప్టెంబర్ 1 నుంచి 45 రోజుల పాటు బాబు ష్యూరిటీ, భవిష్యత్ గ్యారెంటీ పేరిట కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. కోటి ఇళ్లను సందర్శించేలా కార్యక్రమాన్ని రూపొందించాం. ప్రభుత్వ తప్పుడు విధానాలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లేలా సభలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 31న యువగళం పాయదాత్ర 200 వ రోజుకు చేరుకుంటుంది. ఈ సందర్భంగా నిర్వహించనున్న సంఫీుభావ యాత్రలో జగన్ ప్రభుత్వ బాధితులను భాగస్వామ్యం చేయాలన్నారు. బాబు ష్యూరిటీ .. భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో అధినేత చంద్రబాబు 30 నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. రాయలసీమ నుంచి చంద్రబాబు పర్యటన ప్రారంభమవుతుంది అని అన్నారు.













