ఇంకా ఆలస్యం చేస్తే.. ఏపీ మరో శ్రీలంక

ప్రజలు రాళ్లతో కొట్టే పరిస్థితి వచ్చిందని, ఇంకా ఆలస్యం చేస్తే ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక అవుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టీడీపీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రజల మద్దతు టీడీపీకే ఉందన్నారు. జగన్ ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకున్నారని, ప్రభుత్వాన్ని నడపడంలో వైఫల్యం చెందారని ఆరోపించారు. జగన్ పాలనలో రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. వైసీపీ ముందస్తు ఎన్నికలు వెళ్లే అవకాశం ఉందని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీడీపీ 160 స్థానాలు గెలుస్తుందని, మళ్ళీ చంద్రబాబు సీఎం అవుతారని అన్నారు.
వాసిరెడ్డి పద్మ ఇచ్చిన నోటీసులు చిత్తు కాగితాలతో సమానమని అన్నారు. విజయవాడ ప్రభుత్వ హాస్పటల్లో యువతిపై మూడు రోజులు అత్యాచారం జరిగితే ప్రభుత్వం స్పందించ లేదని మండిపడ్డారు. ప్రభుత్వం నుంచి ఎవరూ రాక పోతే బాధితురాలిని పరామర్శించేందుకు చంద్రబాబు వెళ్లారన్నారు. చంద్రబాబు చేసిన సంక్షేమ పథకాల కంటే జగన్ చేసింది ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. అమ్మఒడి మోస పూరిత పథకమని, ఆయన పతనం ప్రారంభమైందన్నారు. పవన్ కల్యాణ్‌కు ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా ప్రభుత్వ తప్పుల్ని ఎండగడుతున్నారని, పవనను ఎదుర్కోలేక దత్తపుత్రుడని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.











































































