ఇలా చేస్తే ప్రజల చేతిలో.. బడితపూజ

ర్యాలీలు, సంబరాలతో అమాయకుల ప్రాణాలు తీస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కళ్యాణదుర్గంలో చావుబతుకుల్లో ఉన్న చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్తుంటే కనీసం దారి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. వైద్యం అందించడం ఆలస్యమై పండు అనే చిన్నారి మృతి చెందిందని, ఈ ఘటన చాలా బాధ కలిగించిందన్నారు. కనీసం బాధితులను పరామర్శించేంత ఓపిక, సమయం కూడా మంత్రికి లేదా అని నిలదీశారు. ముఖ్యమంత్రి, మంత్రులు బయటకు వస్తే జనం బలవ్వాల్సిందేనా అని ప్రశ్నించారు. సీఎం కారు ఎక్కితే చాలు షాపులు మూసుకుని లోపే ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇష్టమెచ్చినట్లు వ్యవహరిస్తామని, ఇలాగే చేస్తామని అహంకారాన్ని ప్రదర్శిస్తే ప్రజల చేతిలో బడితపూజ తప్పదని హెచ్చరించారు.











































































