బీసీలకు జరిగిన అన్యాయంపై చర్చకు సిద్ధమా? : అచ్చెన్న

వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు జరిగిన అన్యాయంపై చర్చకు సిద్ధమా? అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన బీసీ నేతల సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అచ్చెన్న మాట్లాడుతూ బీసీలకు ఎన్నో పథకాలు తీసుకొచ్చింది టీడీపీ ప్రభుత్వ హయాంలోనేనని అన్నారు. బలహీనవర్గాలను సీఎం జగన్ ఉక్కుపాదంతో అణచివేస్తున్నారని ఆరోపించారు. బలహీనవర్గాల నిధులను దారిమళ్లించిన ఘనత వైసీపీదే అని ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి బలహీనవర్గాలంటే కోపమని విమర్శించారు. నాడు వైఎస్ పైసా నిధులు కూడా కేటాయించకుండా బీసీ ఫెడరేషన్లను పెట్టారని, నేడు బీసీ కార్పొరేషన్ల నిధులు కూడా జగన్ లాక్కుని మోసగించారని ఆరోపించారు. రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి ముగ్గురికి పంచారని అన్నారు. అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో బీసీలకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయగలరా? అని నిలదీశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీకి 160 సీట్లు వస్తాయని అన్నారు.











































































