Abhishek: ఆర్థిక ఇబ్బందులతో అమెరికాలో… గుడివాడ యువకుడు ఆత్మహత్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన అభిషేక్ (Abhishek) అమెరికాలో బలవన్మరణానికి పాల్పడ్డారు. సరైన ఉద్యోగం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులే ఇందుకు కారణమని తెలుస్తోంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం గుడివాడ మండలం దొండపాడుకు చెందిన కొల్లి శ్రీనివాసరావు (Kolli Srinivasa Rao) ప్రైవేటు ఉద్యోగి. ఉద్యోగరీత్యా గుడివాడ రాజేంద్రనగర్‌లో నివాసం ఉంటున్నారు. తన కవల పిల్లలైన అభిషేక్, అరవింద్ (Arvind) లను చదివించి, పదేళ్ల కిందట అమెరికా పంపారు. అన్నదమ్ములిద్దరూ ఆరిజోనా రాష్ట్రంలోని ఫీనిక్స్ (Phoenix) లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఏడాది కిందట అభిషేక్‌కు వివాహమైంది. భార్యతో కలిసి అభిషేక్ ఫీనిక్స్లోనే ఉంటున్నారు. సరైన ఉద్యోగం లేక, ఆరు నెలలుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.
శనివారం అభిషేక్ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. భార్య చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చి,అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పలుచోట్ల వెతికి అభిషేక్ మృతదేహాన్ని కనుగొన్నారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారని భావిస్తున్నారు. మృతదేహం వద్ద లభించిన గుర్తింపు కార్డుల ఆధారంగా అవిరంద్కు తానా సభ్యులు (Tana members) సమాచారం ఇచ్చారు. కుమారుడు మరణించాడని తెలిసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. శ్రీనివాసరావును ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పరామర్శించారు. అభిషేక్ మృతికి సంబంధించిన వివరాలను అమెరికాలోని తానా సభ్యులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని గుడివాడ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు.







