మళ్లీ ముకేశ్ అంబానీదే అగ్రస్థానం
భారత్ అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మళ్లీ అగ్రస్థానంలో నిలిచారు. 2018 సంవత్సరానికి గాను ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన భారత సంపన్నుల జాబితాలో వరుసగా 11వ ఏడాది ముకేశ్ ప్రథమ స్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్ జాబితా ప్రకారం ఈయన సంపద రూ.3.49 లక్షల కోట్లు. ఈ ఒక్క ఏడాదే ముకేశ్ సంపద రూ.68 వేల కోట్లు పెరిగింది. ఈ జాబితాలో విప్రో చైర్మన్ అజిమ్ ప్రేమ్జీ రెండో స్థానంలో ఉన్నారు. ఈయన సంపద విలువ రూ.1.55 లక్షల కోట్లు. ఇక రూ.1.35 లక్షల కోట్లతో ఏర్సెలార్ మిత్తల్ చైర్మన్ లక్ష్మీ మిత్తల్ మూడో స్థానంలో నిలిచారు.
100 మంది సంపన్నులతో ఫోర్బ్స్ జాబితాను విడుదల చేసింది. ఈ ఏడాది వీరి మొత్తం సంపద 492 బిలియన్ డాలర్లు. ఈ 100 మంది కుబేరుల్లో 11 మంది సంపద ఈ ఏడాది 1 బిలియన్ డాలర్లకు పైగా పెరిగిందని ఫోర్బ్స్ ఇండియా తెలిపింది. ఇక ఈ ఏడాది కేవలం నలుగురు మహిళలు మాత్రమే ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. వీరిలో బయోకాన్ చైర్మన్ కిరణ్ ముజుందార్ షా ఒకరు. ఈమె సంపద విలువ రూ.26వేల కోట్లు. ఈ జాబితాలో కిరణ్ 39వ స్థానంలో ఉన్నారు.













