ఢిల్లీ ఎన్నికల్లో పక్కా లోకల్ కే పట్టం
ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆప్ పార్టీ ఘనవిజయం సాధించింది. మరోసారి ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ తిరుగులేని విజయం సాధించాడు. ఈ విజయాన్ని దక్కించుకోవడానికి ఆప్ పార్టీ పక్కా లోకల్‌గా వ్యవహరించి ప్రచారం చేసింది. భారతీయ జనతా పార్టీ లోకల్‌ను మరిచింది. దాంతో దెబ్బతింది. జాతీయ భావన పేరుతో విసిరిన మత భావ పాచికను పట్టించుకోకుండా, తమ చిన్ని చిన్ని కోర్కెను తీర్చిన, తీర్చగడన్న వ్యక్తి కేజ్రీవాల్ అని భావించి అతడిని, ఆప్ శ్రేణిని ఢిల్లీ ప్రజలు గెలిపించారు. సరిగ్గా ఎనిమిది నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ‘జాతీయ’ అజెండాను అక్కున చేర్చుకుని భారతీయ జనతా పార్టీకి సంపూర్ణ విజయం (ఏడు లోక్‌సభ స్థానాలోనూ) అందించిన ఢిల్లీ ఓటరు, ఇప్పుడు అసెంల్లీ ఎన్నికల్లో ‘పక్కా లోకల్’ పార్టీకి ఓటేశారు.
ఢిల్లీ ఓటరులో పరిణితిని పసిగట్టడంలో కేజ్రీవాల్ చూపిన యుక్తిని బీజేపీ ప్రదర్శించలేకపోయింది. ఇప్పుడు కేజ్రీవాల్ విజయం దేశవ్యాప్తంగా ప్రభావం చూపించబోతోంది. ప్రధాని మోడీ-బీజేపీ సారధి అమిత్ షా జోడీ రాజకీయాన్ని ఎదురొడ్డి నిలిచిన రాజకీయ మేధావిగా కేజ్రీవల్ దేశంలో చాలామందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఈసారి ఎన్నికలు సాదాసీదాగా జరగలేదు. ఈసారి ఫలితాలు యథాలాపపరిణామం ఎంతమాత్రం కాదు. భవిష్యత్‌లో ఎన్నికను ఎదుర్కొనే ప్రతి ఒక్కరికీ ఈ ఎన్నికు ఎన్నో పాఠాలు నేర్పేవే. ప్రజాభీష్టానికి అనుగుణంగా మారే నేతకు గెలుపు రుచి చూపించిన ఓటరు తెగువ ఇక్కడ కనిపిస్తోంది. తమ లేదా తమపార్టీ అభీష్ఠానికి అనుగుణంగా తీర్పు కోరినవారి మాటను మన్నించని ఘనమైన ఓటరు నేర్పు ఇక్కడ కనిపించింది. జనతంత్రం ముందు మాట మంత్రాలు పనిచేయవని తేలిపోయింది. అదీ చాలా స్పష్టంగా. ఇంతకీ కేజ్రీవాల్ చేసిన జిమ్మిక్కేమిటి….బీజేపీ చేసిన తప్పులేమిటి.. జనం పవరేమిటి. ఇది ఒకటి రెండు అంశాలతో తేల్చేసేది కాదు. అడుగడుగునా వ్యూహ చతురత ఉంది, ఎత్తుగడ ఉంది. జనం మూడ్‌ను, నాడిని పసిగట్టే తంత్రముంది. విజయమంత్రముంది.
అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే సారథ్యంలో ఉద్యమంలోకి అడుగుపెట్టి, ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ సారథి కేజ్రీవాల్‌ను ఢిల్లీ ప్రజలు 2013 ఎన్నికల్లో ఆదరించారు. 28 స్థానాతో రెండో స్థానంలో నిలిచినప్పటికీ కాంగ్రెస్ మద్దతుతో అధికారంలోకి వచ్చారు. అనేక పరిణామాల మధ్య 49 రోజులు తరువాత మళ్లి ఎన్నికకు వెళ్లాల్సి వచ్చింది. కేంద్రప్రభుత్వంతో జగడం, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌తో పేచీతో కాలక్షేపం చేశారు. రాజకీయాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడంలో తడబడ్డారు. అయినా 2015లో తిరుగులేని స్థాయిలో విజయం సాధించి అధికారం చేపట్టారు. అప్పుడు కూడా కేంద్రంతో పేచీతోనే గడిపారు. వీధి నాటకాల తరహాలోనే ఆయన ధోరణి కనిపించింది. ఆ తరువాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి ఎదుర్కోవడంతో పాఠాలు నేర్చుకున్నారు. కేంద్రంతో కలహంకన్నా జనానికి ఏం కావాలో చేస్తే చాని గ్రహించి నెమ్మదిగా అడుగు వేశారు. తనని తాను మార్చుకుంటూ వచ్చారు. మాట దాడి తగ్గించి, పనుల వేగం పెంచారు.
ఇక గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లోనూ ఎదురుదెబ్బ తగలడంతో మరింత జాగ్రత్తపడి రాజకీయ వ్యూహాలకు పదునుపెట్టారు. ఆక్టోపస్‌లా ఒక్కో ప్రాంతంలో అధికారంలోకి వచ్చేస్తూన్న బీజేపీని ఎదుర్కొనేందుకు ఏడాది ముందునుంచే ఆయన వ్యూహాలు పన్నారు. అంతా మౌనంగానే. సుపరిపాలన అందిస్తూనే మళ్లి అధికారంలోకి వచ్చేందుకు ఉచిత పథకాల ప్రయోగాన్ని విజయవంతంగా అమలు చేశారు. చివరకు ఫలితం సాధించారు. కానీ 21 ఏళ్లక్రితం ఢిల్లీ లో అధికారం కోల్పోయిన బీజేపీ తన వైఖరిని మార్చుకోలేదు. జనం నాడిని పట్టలేదు. 2013, 15 ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా జాతీయ అంశాలను నెత్తికెత్తుకుంది. అప్పటిలానే మోడీ, అమిత్‌షా సహా మంత్రులు, వందమంది ఎంపీలు మూకుమ్మడిగా వచ్చినా వారు చేసిన ప్రసంగాను ఢిల్లీ ప్రజలు పట్టించుకోలేదు. సరికదా వారికి వ్యతిరేకంగా ఓటు వేసి తమకు తమగురించి పట్టించుకునేవారు కావాలని తేల్చి చెప్పారు.













