మిత్రదేశాలకే ట్రంప్ వార్నింగ్..?
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ మాటలు తూటాల్లా పేలుస్తారు. అది ప్రత్యర్థి అయినా, మిత్రుడైనా .. తూటాలో మాత్రం ఏమార్పు ఉండదు. ఈసంగతి అమెరికా మిత్రదేశాలకు తెలుసు. అయితే అదే విషయాన్ని నాటో మిత్రదేశాలకు తాను స్పష్టం చేశానన్నారు ట్రంప్. తన హయాంలో నాటో సభ్యదేశాలు నిబంధనల ప్రకారం రక్షణ బడ్జెట్లు పెంచుకోకుంటే.. వాటిపైకి రష్యాను ఉసిగొల్పుతానని మిత్రులకు నిర్మొహమాటంగా చెప్పామన్నారు ట్రంప్. కరోలినా ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గతంలో జరిగిన నాటో సమావేశంలో ఓ దేశాధినేత .. కూటమి నిబంధనల మేరకు మేం రక్షణపై ఖర్చు చేయలేదనుకోండి.. మా పై రష్యా దాడి చేస్తే అమెరికా కాపాడదా? అని ప్రశ్నించారు. అమెరికా వారిని రక్షించదని నేను నిర్మొహమాటంగా చెప్పాను. మాస్కో ఏం కావాలనుకుంటే అది చేయాలని ప్రోత్సహిస్తా’’ అని వెల్లడించినట్లు ట్రంప్ ఈ సందర్భంగా చెప్పారు.
ట్రంప్ వ్యాఖ్యలపై శ్వేతసౌధం ప్రతినిధి ఆండ్రూ బెట్స్ స్పందించారు. ‘‘హంతక పాలకులను మా మిత్రదేశాలపై ఉసిగొల్పుతాననడం భయంకరమైన విషయం. ఇలాంటివి అమెరికా, ప్రపంచ శాంతి భద్రతలను ప్రమాదంలో పడేస్తాయి’ అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలు అమెరికాలోని రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించాయి. 2014లో క్రిమియాను రష్యా ఆక్రమించిన తర్వాత నాటో సభ్య దేశాలు అప్రమత్తమయ్యాయి. కోల్డ్‌వార్ తర్వాత భారీగా తగ్గించిన రక్షణ ఖర్చును మళ్లీ పెంచాలని నిర్ణయించాయి. 2024 నాటికి ఆయా దేశాల జీడీపీలో ఇది కనీసం 2శాతం ఉండేలా చూసుకోవాలనుకున్నాయి. ప్రస్తుతం నాటోలో ఉన్న 31 దేశాల్లో కేవలం ఏడు మాత్రమే ఈ నిబంధనను పూర్తి చేశాయి. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించడంతో కొన్ని నాటో దేశాల మీద ఆర్థిక ఒత్తిడి పెరిగిపోయింది.






