Washington: హార్వర్డ్ కు నిధుల నిలిపివేత.. ట్రంప్ సర్కార్ కీలక చర్యలు

ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ ట్రంప్ ఆగ్రహానికి గురైంది. ఆ విశ్వవిద్యాలయానికి అందించే ఫెడరల్ నిధులను నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రభుత్వంలోని విద్యాశాఖ మంత్రి లిండా మెక్‌మాన్ ప్రకటించారు. విశ్వవిద్యాలయంపై నియంత్రణ ఆశిస్తూ కొన్ని విధానపరమైన మార్పులు తీసుకురావాలని విశ్వవిద్యాలయానికి సూచించినప్పటికీ.. దానికి ససేమిరా అనడంతో విశ్వవిద్యాలయం బడ్జెట్, పన్ను మినహాయింపుల్లో కోతలు విధిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ డిమాండ్లను నెరవేర్చే వరకు హార్వర్డ్‌కు ఎటువంటి కొత్త గ్రాంట్లు మంజూరుచేయమని స్పష్టం చేశారు.
ఫెడరల్ పరిశోధన గ్రాంట్లకు మాత్రమే ఈ నిషేధం వర్తిస్తుందని.. యూనివర్సిటీ ట్యూషన్ ఫీజులను చెల్లించడానికి విద్యార్థులకు సహాయపడే ఫెడరల్ ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం కొనసాగిస్తుందని విద్యాశాఖ పేర్కొంది. కొత్త గ్రాంట్లకు అర్హత పొందడానికి హార్వర్డ్.. ఫెడరల్ ప్రభుత్వంతో చర్చలు జరపాల్సి ఉంటుందని మెక్‌మాన్ తెలిపారు. అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్న విదేశీ విద్యార్థులకు హార్వర్డ్‌లో ప్రవేశం కల్పిస్తూ.. దేశ అత్యున్నత విద్యావ్యవస్థను అపహాస్యం చేసిందని ఆరోపించారు. మరోవైపు విశ్వవిద్యాలయంపై జాతి వివక్షపై ఫిర్యాదులు వచ్చాయని, వాటిపై విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు.
చట్టవిరుద్ధ చర్యలను వ్యతిరేకిస్తూనే ఉంటాం: హార్వర్డ్
అమెరికా ప్రభుత్వం ఫెడరల్ నిధులను నిలిపివేయడాన్ని హార్వర్డ్ విశ్వవిద్యాలయం వ్యతిరేకించింది. ప్రభుత్వం చేసే చట్టవిరుద్ధమైన డిమాండ్లను పాటించడానికి నిరాకరించడంతో సమాఖ్య ప్రభుత్వం విశ్వవిద్యాలయంపై ఇటువంటి చర్యలు తీసుకుంటోందని హార్వర్డ్ అధ్యక్షుడు అలాన్ గార్బర్ పేర్కొన్నారు. ప్రభుత్వం తమను ఎన్నిరకాలుగా అణచివేయడానికి ప్రయత్నించినా పోరాడుతూనే ఉంటామని అన్నారు.
విదేశీ విద్యార్థుల అక్రమ, హింసాత్మక కార్యకలాపాల రికార్డులను సమర్పిస్తేనే కొత్తగా విదేశీయులను చేర్చుకునేందుకు అనుమతిస్తామని వైట్‌హౌజ్ గతవారం హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి స్పష్టం చేసింది. రికార్డులను సమర్పించకపోతే వర్సిటీకున్న ప్రవేశాల అర్హతను రద్దు చేస్తామని హెచ్చరించింది. ఈ పరిణామాలపై హార్వర్డ్ స్పందిస్తూ.. ప్రభుత్వ డిమాండ్లకు ఏమాత్రం తలొగ్గేది లేదని.. తమ స్వాతంత్య్రం, రాజ్యాంగ హక్కుల విషయంలో రాజీ పడలేమని పేర్కొంది. తాము చట్ట ప్రకారమే నడుచుకుంటామని.. ప్రభుత్వ యంత్రాంగం కూడా వాటికి అనుగుణంగానే వ్యవహరించాలని కోరింది. ఈనేపథ్యంలోనే విశ్వవిద్యాలయానికి ఇచ్చే నిధులపై ట్రంప్ యంత్రాంగం కోత విధించింది.