Sydney: సిడ్ని టెర్రర్ తో పాక్ ఉగ్రలింకులు..? తండ్రీ, కొడుకు హంతకులు..!
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ప్రఖ్యాత బోండీ బీచ్‌లో యూదుల హనుక్కా వేడుకలో జరిగిన కాల్పుల ఘటనను పోలీసులు ఉగ్రదాడిగా ప్రకటించారు. ఈ ఘాతుకానికి పాల్పడింది తండ్రీకొడుకులని, వీరి వయసు 50, 24 సంవత్సరాలని న్యూ సౌత్ వేల్స్ పోలీసులు తెలిపారు. ఈ దాడిలో ఇతర నిందితుల ప్రమేయం లేదని కూడా వారు స్పష్టం చేశారు.
పోలీసుల ఎదురుకాల్పుల్లో 50 ఏళ్ల తండ్రి అక్కడికక్కడే మరణించగా, 24 ఏళ్ల కొడుకు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో పోలీసుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా సిడ్నీ శివార్లలోని బోనీరిగ్, క్యాంప్సీ ప్రాంతాల్లో ఉన్న రెండు ఇళ్లపై దాడులు చేసి సోదాలు నిర్వహించినట్లు ఆయన చెప్పారు.
మరణించిన 50 ఏళ్ల వ్యక్తి లైసెన్సుడ్ గన్ హోల్డర్ అని, అతడి పేరు మీద ఆరు తుపాకులు రిజిస్టర్ అయి ఉన్నాయని పోలీస్ కమిషనర్ నిర్ధారించారు. దాడిలో బహుశా అవే ఆయుధాలను వాడి ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు. ఘటనా స్థలం సమీపంలో రెండు శక్తివంతమైన బాంబులను (IEDs) కూడా కనుగొని నిర్వీర్యం చేసినట్లు ఆయన వెల్లడించారు.
చేపల వేటకని వచ్చి ఉగ్ర దాడి..
సిడ్నీలోని బోండీ బీచ్‌లో ఉత్సవం సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపిన నిందితులు.. పాక్ కు చెందిన వ్యక్తులుగా గుర్తించారు.]వారు తండ్రీకొడుకులని, వీరిని సాజిద్ అక్రమ్ (50), నవీద్ అక్రమ్ (24) అని పోలీసులు తెలిపారు. వీరి కుటుంబం పాకిస్థాన్ నుంచి వచ్చి కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలో నివాసం ఉంటోంది. సాజిద్ స్థానికంగా పండ్ల దుకాణం నడుపుతుండగా.. నవీద్ రెండు నెలల కిందటే ఉద్యోగం కోల్పోయినట్లు తెలిపారు. చేపల వేటకు వెళ్తున్నామని వీరిద్దరూ కుటుంబసభ్యులకు చెప్పినట్లు దర్యాప్తులో గుర్తించారు. దాడి సమయంలో సాజిద్ మృతి చెందగా.. నవీద్‌ను పోలీసులు అరెస్టు చేశారు.













