తొమ్మిదోసారి సీఎంగా నితీష్ కుమార్..
బిహార్‌లో బీజేపీ-జేడీయూ సర్కార్ కొలువుదీరింది. రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే బిహార్ సీఎంగా నితీష్ కుమార్ మళ్ళీ ప్రమాణ స్వీకారం చేశారు. నితీష్‌తో పాటు డిప్యూటీ సీఎంగా సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిద్దరూ బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు. దీంతో తొమ్మిదవ సారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ కొత్త రికార్డును సృష్టించారు. ఆయనతో పాటు మరో ఎనిమిది మంది మంత్రులు గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. జేడీయూ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ముగ్గురు, హిందుస్థాన్ ఆవామ్ మోర్చా నుంచి ఇద్దరు, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేశారు.
బిహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి ఉపముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. అలాగే విజయ్ కుమార్ సిన్హా, డా. ప్రేమ్ కుమార్ లు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. జేడీయూ నుంచి విజయ్ కుమార్ చౌదరి, విజయేంద్ర ప్రసాద్ యాదవ్, శ్రవణ్ కుమార్ మంత్రులుగా ఎంపికయ్యారు. హిందుస్థాన్ ఆవామ్ మోర్చా నుంచి సంతోష్ కుమార్, సుమన్‌కు కేబినెట్ బెర్త్ దక్కింది. నితీశ్ ప్రమాణ స్వీకారానికి బీజేపీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఆదివారం మధ్యాహ్నం రాజ్ భవన్లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ కు లేఖ సమర్పించిన తర్వాత బిహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. మహాగఢ్ బంధన్ కూటమి నుంచి వైదొలగి ఎన్డీయేతో చేతులు కలిపారు నితీష్ కుమార్.
అయితే బీజేపీ-జేడీయూ కూటమిపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్. బీహార్‌లో ఇప్పుడే అసలైన ఆట మొదలైందని అన్నారు. ప్రస్తుతం నితీష్ ఏం మాట్లాడుతున్నారో కూడా ఆయనకు తెలియటం లేదని ఎద్దేవా చేశారు. నితీష్ చేసిన పనికి బీహార్ ప్రజలు చీదరించుకుంటున్నారని అన్నారు తేజస్వి యాదవ్. జేడీయూ ఏం చేసినా బీహార్ ప్రజలు మాత్రం తమ వెంటే ఉంటారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జేడీయూ భూస్థాపితం అవుతుందన్నారు తేజస్వీ. మరోవైపు లలూ కుమార్తె..మరో ఘాటు ట్వీట్ చేశారు. చెత్త, చెత్తబుట్టలోకి వెళ్లిందని పోస్టు పెట్టారు.
మరోవైపు.. ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో సింగిల్‌గా మెజార్టీ సాధించేదిశగా లల్లూయాదవ్ .. ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఊసరవెళ్లికే పాఠాలు నేర్పేలా నితీష్ రాజకీయాలున్నాయన్నారు కాంగ్రెస్ నేతలు. నితీష్ కూటమి నుంచి జంప్ అవుతారని తమకు ముందే తెలుసన్నారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే. ఈ విషయాన్ని ఇప్పటికే లాలూ, తేజస్వీ తమకు చెప్పారన్నారు.అయితే పొత్తు ధర్మాన్ని అనుసరించి, తాము దాన్ని బహిర్గతం చేయలేదన్నారు. అయినా నితీష్ లాంటి ఆయారాం, గయారాంలు వస్తూ, పోతూ ఉంటారన్నారు ఖర్గే. తాము మాత్రం ఇండియా కూటమిని పటిష్టపరిచేందుకే ప్రయత్నిస్తామన్నారు.













